
- ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తున్నం: ఎంపీ చామల
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పకనే చెప్పిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎంగా, హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నపుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన గుర్తు చేశారు. పీసీ ఘోష్ కమిషన్రిపోర్టును బలపరుస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చను కూడా ఆమోదించినట్టుగా కవిత మాట్లాడారని, ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని వెల్లడించారు.
మిగులు బడ్జెట్ తో తెలంగాణను కేసీఆర్ కు అప్పగిస్తే 10 ఏండ్లలో అప్పుల పాలు చేసిండని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పై సీబీఐ దర్యాప్తుతో కవిత భయపడుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ దోచుకున్న దాంట్లో కవితకు వాటా రాలేదని ఆమె వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతున్నదన్నారు. కేసీఆర్ పేరును తీసేసి హరీశ్ రావు పేరు ఉంచాలన్న విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అయితే అంత పెద్ద ప్రాజెక్టు సీఎం ఆమోదం లేకుండా నిర్మిస్తారా అని చామల ప్రశ్నించారు. దోచుకున్న డబ్బుల్లో వాటా రానందువల్లే కేసీఆర్ కుటుంబంలో గొడవలు అవుతున్నాయనిప్రజలకు అర్థమైందన్నారు.