ఇంతటితో ఆగదు.. యావత్ దేశాన్ని కదిలించేలా బీసీ ఉద్యమం చేపడతం: ఎంపీ ఆర్.కృష్ణయ్య

ఇంతటితో ఆగదు.. యావత్ దేశాన్ని కదిలించేలా బీసీ ఉద్యమం చేపడతం: ఎంపీ ఆర్.కృష్ణయ్య

హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించే విధంగా బీసీ ఉద్యమం చేపడతామని ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఏదైనా ఒక రాష్ట్రంలో ఉద్యమం జరిగితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల్లో కూడా పడుతుందని అన్నారు. ఆదివారం (అక్టోబర్ 12) లక్డీకపూల్‎లోని అశోక హోటల్‎లో బీసీ సంఘాలు సమావేశమయ్యాయి. బీసీ రిజర్వేషన్ల సాధనకై ఐక్యంగా పోరాడాలని బీసీ సంఘాలన్నీ ఒక్కటై బీసీ జీఏసీగా ఏర్పడ్డాయి. 

బీసీ జేఏసీ చైర్మన్‎గా రాజ్య సభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్‎గా వీజీఆర్ నారగోని,  వర్కింగ్ ఛైర్మెన్‎గా జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్లుగా దాసు సురేష్, రాజారామ్ యాదవ్‎లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలోనే అక్టోబర్ 14న తలపెట్టిన బీసీ సంఘాల తెలంగాణ బంద్‎ను ఈ నెల 18కి వాయిదా వేయాలని బీసీ జేఏసీ నిర్ణయించింది.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల్లోని ప్రతి కుల నుంచి నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని.. వాళ్లకు తగిన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఇంతటితో ఆగదని.. బీసీలను చట్ట సభల్లో కూర్చోబెట్టేవరకు పోరాడతామని తేల్చిచెప్పారు.

బీసీ జేఏసీ ఆధ్యర్యంలో 2025, అక్టోబర్ 18న తెలంగాణ రాష్ట్ర బంద్‎కు పిలుపునిచ్చామని.. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. రాబోయే ఈ వారం రోజుల కార్యాచరణను ఇప్పటికే మొదలుపెట్టామని చెప్పారు.  తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పని చేసామో అంత కన్నా ఎక్కువగా బీసీ ఉద్యమాన్ని చేస్తామని స్పష్టం చేశారు. అన్ని పార్టీలను మా ఉద్యమంలో కలుపుకుని పోతామన్నారు.