వడ్ల కొనుగోళ్లకు సిద్ధం.. ములుగు జిల్లాలో 204 కొనుగోలు కేంద్రాలు

వడ్ల కొనుగోళ్లకు సిద్ధం.. ములుగు జిల్లాలో 204 కొనుగోలు కేంద్రాలు
  • 1.8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలే లక్ష్యం
  • అందుబాటులో 26 లక్షల గోనె సంచులు

ములుగు, వెలుగు: వానాకాలం అన్నదాతలు పండించిన ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ములుగు జిల్లాలోని 10 మండలాల పరిధిలో సివిల్​ సప్లై శాఖ ద్వారా 2025-26 సీజన్  పంట కొనుగోలు చేసేందుకు కలెక్టర్​ దివాకర పర్యవేక్షణ చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తామని, జిల్లాలో త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నామని అధికారులు స్పష్టం చేశారు.  

జిల్లాలో 204 కొనుగోలు కేంద్రాలు.. 

జిల్లాలో మొత్తం 204 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 59, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) 108, డీసీఎంఎస్ 2, ఎఫ్ పీవోలు, జీసీసీలు కలిపి 35 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ సీజన్ లో 1.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొనుగోలుకు అవసరమైన 37 లక్షల గోనె సంచుల్లో ఇప్పటికే 26 లక్షల సంచులు గోడౌన్లలో అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 11 లక్షల సంచులను సైతం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.

 రైతులు తమ గ్రామాలకే సమీపంలో ధాన్యం విక్రయించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తాగునీరు, షెడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, ప్యాడీ క్లీనర్లు, హస్క్ రిమూవర్స్, గ్రెయిన్ క్యాలిఫయర్స్, టార్పాలిన్లు తదితర అన్ని వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 

నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ..

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కలెక్టర్​ దివాకర సివిల్​సప్లై అధికారులతో కలిసి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కేంద్రాల ఇన్​చార్జిలు, వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఆదర్శ రైతులు, హార్వెస్టర్ ఆపరేటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. నిబంధనల మేరకు చేపట్టాల్సిన పనులను తెలిపారు. తేమ శాతం, మాయిశ్చర్​ తీసిన ధాన్యం మాత్రమే మిల్లులకు తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

 రైతులకు ఇబ్బంది కలిగించినా, మోసాలకు పాల్పడినా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అధికారుల ఫోన్​ నెంబర్లతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలని, వాతావరణ యాప్​ ద్వారా రైతులకు ముందస్తు అలెర్ట్ ఇచ్చేందుకు సైతం చర్యలు తీసుకోనున్నారు. సివిల్​ సప్లై, వ్యవసాయ అధికారులు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. 

రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు..

జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే నిర్వాహకులకు శిక్షణ పూర్తయ్యింది. నిబంధనల మేరకు రైతుల నుంచి కొనుగోలు చేపడుతాం. వేగంగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వానాకాలం సీజన్‌‌ లో మంచి దిగుబడి వస్తుంది.  రాంపతి, సివిల్​ సప్లై డీఎం, ములుగు జిల్లా

ప్రొటోకాల్ పాటించాలి.. 

జిల్లాలో చేపట్టే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలి. ప్రొటోకాల్​ఉల్లంఘన జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. కేంద్రాల వద్ద అకాల వర్షంతో ధాన్యం తడవకుండా చూడాలి. 10లక్షల అదనపు గన్నీ బ్యాగుల కేటాయింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సివిల్​ సప్లై అధికారులకు సూచించాం. కొనుగోలు వివరాలు ట్యాబ్​ఎంట్రీ ద్వారా జరగాలి. అవసరమైన మేర హమాలీలు అందుబాటులో ఉంచుకోవాలి. - దివాకర, ములుగు కలెక్టర్​ ​