బల్దియా పోరుకు మోగిన నగారా నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ

బల్దియా పోరుకు మోగిన నగారా   నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
  • కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు 13 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు  
  • ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ 

కరీంనగర్, వెలుగు:  మున్సిపల్ ఎన్నికల నగారా  మోగింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు చొప్పదండి, హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్ పల్లి, రాయికల్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం నుంచి 30వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.  31న నామినేషన్లు స్క్రూటినీ చేసి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు.

ఫిబ్రవరి 1న అభ్యంతరాల స్వీకరణ, 2న అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు 3తో ముగియనుండగా అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఇండిపెండెట్లకు గుర్తులు కేటాయిస్తారు. 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే 12న రీపోలింగ్ నిర్వహిస్తారు.  13న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.  

ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు.. 

రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీ ఆఫీసుల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ మున్సిపల్ ఆఫీసులోని రెండు భవనాల్లో మొత్తం 15 రూమ్ లను నామినేషన్ల స్వీకరణ కోసం కేటాయించారు. రెండు డివిజన్లకు ఒకరి చొప్పున  33 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను  నియమించగా, ప్రతి గది వద్ద అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.  కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను మున్సిపల్ స్పెషల్ఆఫీసర్, కలెక్టర్ పమేలాసత్పతి, సీపీ  గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్  పరిశీలించారు. ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల  ప్రకారం నామినేషన్లు  స్వీకరించాలని  అధికారులకు  ఆదేశించారు. 

అభ్యర్థులకు ఉండాల్సిన పత్రాలివే.. 

పోటి చేసే ప్రతి అభ్యర్థి నగరపాలక సంస్థ ఇచ్చిన నామినేషన్ ఫారంతో పాటు కొత్త బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పొలిటికల్ పార్టీ నుంచి ఫామ్  ఏ, ఫామ్ బీ, నేర చరిత్ర సంబంధించిన సర్టిఫికెట్, నగరపాలక సంస్థ నో డ్యూస్ సర్టిఫికేట్, ఓటర్ ఐడీ సమర్పించాల్సి ఉంటుంది.  డిపాజిట్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.  సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరిగా సమర్పించాలి. అభ్యర్థుల అనుమానాల నివృత్తి కోసం మున్సిపాలిటీల ఆవరణలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశారు. 

ఫ్లెక్సీల తొలగింపు 

మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఆశావహులు తమ డివిజన్లు, ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసుకున్న ప్రచార ఫ్లెక్సీలు, రాజకీయ పార్టీల జెండాలను మున్సిపల్ సిబ్బంది మంగళవారం సాయంత్రం తొలగించారు. పార్టీ జెండా గద్దెలు, నాయకుల 
విగ్రహాలకు ముసుగు వేశారు. 

బల్దియా            డివిజన్లు/వార్డులు      ఓటర్లు

కరీంనగర్    66    3,40,580

రామగుండం    60    1,83,049

చొప్పదండి    14    13,916

హుజూరాబాద్30    29,531

జమ్మికుంట    30    34,455

జగిత్యాల    50    94,800

ధర్మపురి    15    13,988

కోరుట్ల    33    63,507

మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి    26    46,201

రాయికల్    12    13,084

మంథని    13    14,402

పెద్దపల్లి    36    43,789

సుల్తానాబాద్    15    16,824

సిరిసిల్ల    39    81,959

వేములవాడ    28    40,877