గెలుపు గుర్రాల వేట!.. పార్టీల్లో మున్సిపల్ ఎన్నికల కసరత్తు

గెలుపు గుర్రాల వేట!.. పార్టీల్లో మున్సిపల్ ఎన్నికల కసరత్తు
  • కాంగ్రెస్ లో ఆశావహుల జాబితాకు వడపోతలు
  • బీఆర్ఎస్​ లో మున్సిపాలిటీలకు ఇన్​చార్జీల నియామకం
  • కాంగ్రెస్ తో సీపీఐ, బీఆర్ఎస్​ తో సీపీఎం పొత్తు దాదాపు ఖరారు!

ఖమ్మం, వెలుగు:  మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ ప్లాన్లు వేస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం ఇప్పటికే వేట మొదలుపెట్టాయి. ఒకవైపు ఆయా పార్టీల ముఖ్య నేతల మధ్య పొత్తు చర్చలు జరుగుతుండగా, అదే సమయంలో సొంతంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా చేస్తున్నారు. ఎలక్షన్​ షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా, అన్నింటికీ సిద్ధంగా ఉండేలా నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు రిజర్వేషన్​ కలిసి వచ్చిన అభ్యర్థులు తమకు టికెట్ వచ్చేలా చేయాలంటూ, మద్దతు కోసం గాడ్​ ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. టికెట్ హామీ దక్కించుకున్న వారేమో ఎలక్షన్ ఖర్చుల కోసం డబ్బు సమకూర్చుకునే పనిలో పడ్డారు. లిక్విడ్ క్యాష్ అరేంజ్​ చేసుకునేందుకు ముందున్న ఆప్షన్లను పరిశీలిస్తున్నారు.

కాంగ్రెస్​ లో ఇదీ పరిస్థితి..

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్​చార్జీలుగా రాష్ట్ర పార్టీ నియమించింది. ఖమ్మం లోక్​ సభ సెగ్మెంట్ ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, మహబూబాబాద్​ సెగ్మెంట్ ను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ కు అప్పగించారు. జిల్లాల వారీగా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు కన్వీనర్ బాధ్యతలు చూస్తున్నారు. ఇక తమ అసెంబ్లీ పరిధిలోని మున్సిపాలిటీల్లో గ్రౌండ్​ లెవల్ పరిస్థితిపై ఇప్పటికే ఎమ్మెల్యేలు వేర్వేరు మార్గాల్లో రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ప్రత్యేక శ్రద్ధపెట్టారు. మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైరాలో ఎమ్మెల్యే రాందాస్​ నాయక్​, సత్తుపల్లి, కల్లూరుపై ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్​ నజర్​ పెట్టారు. 

ఆశావహులను ఫిల్టర్​ చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపిక కోసం వార్డుల వారీగా కమిటీలను, నాలుగు వార్డులకు ఒకటి చొప్పున జోనల్​ కమిటీలను ఏర్పాటుచేశారు. అభ్యర్థుల అర్హత, ఆర్థిక పరిస్థితి, గెలుపు అవకాశాలు, బ్యాక్​ గ్రౌండ్​, ఇలా అన్ని అంశాలపై ఇంటలిజెన్స్​, సొంత సర్వే టీమ్​ లతో పాటు వేర్వేరు మార్గాల్లో ఫీడ్ బ్యాక్​ తెప్పించుకుంటున్నారు. వార్డుకు నలుగురు నుంచి ఐదుగురు చొప్పున ఆశావహుల నుంచి ఎలక్షన్​ డేట్ వచ్చే సమయానికి, పొత్తులపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత ఫైనల్ గా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.

బీఆర్ఎస్​ లోనూ ఎన్నికల సందడి..

బీఆర్ఎస్​ పార్టీలోనూ మున్సిపల్​ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఇవాళ వైరాలో మున్సిపల్ ఎన్నికలపై పార్టీ సన్నాహాక సమావేశం జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ హాజరుకానున్నారు. వైరాకు అజయ్​ను, మధిరకు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఇన్​చార్జీగా నియమించినట్టు తెలుస్తోంది. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కసరత్తు మొదలుపెట్టారు. మరోవైపు ఏదులాపురం మున్సిపల్ ఎన్నికలను మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వైరా, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల్లో వార్డుల షేరింగ్ పై బీఆర్ఎస్, సీపీఎం నేతల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 

పొత్తులపై కొంత సస్పెన్స్​..

ఉమ్మడి జిల్లాలో పార్టీల మధ్య పొత్తులపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినా, పూర్తిస్థాయిలో ఇంకా క్లారిటీ రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల నాటి పొత్తుల దృష్ట్యా కాంగ్రెస్​ సీపీఐతో  కొంత సానుకూలంగా చర్చలు నడిచాయి. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, ఏదులాపురం మున్సిపల్ చైర్మన్​ విషయంలో రెండు పార్టీల మధ్య అవగాహన కుదరకపోవడంతో సస్పెన్స్​ కంటిన్యూ అవుతోంది. ఇక ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్​, సీపీఎం పార్టీలు కలిసి వెళ్లాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చాయి. 

అయితే వార్డుల వారీగా పంపకాల విషయంలో మున్సిపాలిటీల వారీగానే నిర్ణయం తీసుకోవాలని డిసైడయ్యారు. మరోవైపు తమతో కలిసి రావాలంటూ ఈ రెండు పార్టీల నేతలు సీపీఐతోనూ టచ్ లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమాల్లో ఆ పార్టీ బిజీగా ఉండడంతో, కొద్దిరోజుల పాటు వేచి చూడాలని సీపీఐ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తోంది.