- ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, వెలుగు: ప్రభుత్వం తరఫున నాణ్యమైన విద్య, వైద్యం అందినపుడే పేదలకు న్యాయం జరుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ, 69వ పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ట్రినిటీ విద్యాసంస్థల సౌజన్యంతో చౌటుప్పల్ పట్టణంలో మల్లఖంబ్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు.
రెండు రోజులపాటు జరిగే ఈ రాష్ట్రస్థాయి ఛాంపియన్షిప్ పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి, జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లో రాణించినప్పుడే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. డీఈవో సత్యనారాయణ, చౌటుప్పల్ ఎంఈఓ, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కృష్ణారావు, డైరెక్టర్ మంజుల, చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, నాయకులు పబ్బు రాజు గౌడ్, సూర్య నరసింహ గౌడ్, మొగుదల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
