నాగార్జునసాగర్ కు భారీ వరద..

నాగార్జునసాగర్ కు భారీ వరద..
  • రెండు రోజుల్లో పూర్తిగా నిండనున్న నాగార్జునసాగర్
  • సోమవారం గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు 
  • ఇన్ ఫ్లో 5.36 లక్షల క్యూసెక్కులు

నాగార్జునసాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 5 లక్షల 36 వేల క్యూసెక్కులకుపైగా నమోదు అవుతోంది.  శ్రీశైలం డ్యామ్  గేట్లన్నీ ఎత్తి విడుదల చేస్తుండడంతో  ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్కుల వరద పరవళ్లు తొక్కుతూ సాగర్ కు చేరుకుంటోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండడంతో డ్యామ్ పూర్తిగా నిండిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 
నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 569 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ  సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం  233 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరో 48 గంటల్లో జలాశయo గరిష్ట నీటి మట్టనికి చేరుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఆ తర్వాత క్షణాన్నైనా డ్యామ్ గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గేట్లకు మరమ్మతులు పూర్తి చేశారు. దిగువ ప్రాంత ప్రజలను ఇప్పటి నుండే అప్రమత్తం చేస్తున్నారు.  డ్యామ్ వేగంగా నిండుతున్నదని, క్రస్ట్  గేట్లు ఎత్తేందుకు అన్నీ  ఏర్పాట్లు పూర్తి  చేసినట్లు సాగర్ డ్యామ్ ఎస్.ఇ ధర్మా నాయక్ తెలిపారు.