- కూలీల కొరతతో రైతులకు తప్పని తిప్పలు
నాగర్‌కర్నూల్, వెలుగు: వానాకాలంలో సాగు చేసిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు లాభదాయకంగా మారుతాయని ఆశించిన రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి. వరి, మొక్కజొన్న పంటల పరిస్థితి ఓ మాదిరిగా ఉన్నా పత్తి సాగు చేసిన రైతులు నిండా మునిగామని వాపోతున్నారు. పత్తి కొనుగోలుకు రంగంలోకి దిగాల్సిన సీసీఐ ఇంకా కొనుగోలు సెంటర్లను ప్రారంభించలేదు. భారీ వర్షాలు, కూలీల కొరతతో తిప్పలు పడుతున్న రైతులు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో పత్తి కాయలు రంగు మారుతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు.
ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకుంటే, నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎకరాకు 5 నుంచి 8 క్వింటాళ్లకు మించి దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వర్షాలతో ఏరిన పత్తిని నిల్వ చేసుకోలేక ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటే క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.6,200 మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. పెరిగిన పెట్టుబడి, ఎరువులు, క్రిమిసంహారక మందుల ఖర్చులు తడిసి మోపడయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది భారీగా పత్తి సాగు..
ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 2,89,825 ఎకరాలలో పత్తి సాగు చేశారు. సకాలంలో వర్షాలు కురవడంతో గత ఏడాది కంటే ఈ సారి 45 వేల ఎకరాల్లో ఎక్కువగా పత్తి సాగైంది. జులై నెల నుంచి అక్టోబర్ 20 వరకు విరామం లేకుండా కురిసిన వర్షాలతో 2,500 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. 2,180 మంది రైతులు తీవ్రంగా
నష్టపోయారు.
పక్క జిల్లాల నుంచి కూలీలు..
జిల్లాలో పత్తిసాగు గణనీయంగా పెరగడంతో కూలీల కొరత ఏర్పడుతోంది. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల నుంచి కూలీలు వస్తున్నారు. పత్తి ఏరడానికి వస్తున్న కూలీలకు రోజుకు రూ.500, ఆటో చార్జీ మరో రూ.100 అవుతోంది. ఎకరా గుత్తకు తీసుకుంటున్న కూలీల మేస్త్రీలు కిలోకు రూ.15 చొప్పున వసూలు చేస్తున్నారు. కిలోల లెక్కన రైతుల నుంచి వసూలు చేసుకుంటున్నారు.
పత్తాలేని ఎండలు..
రోజు విడిచి రోజు వానలు కురవడం, పట్టుమని వారం రోజుల పాటు ఎండలు కొట్టకపోవడంతో పత్తిని ఆరబెట్టే అవకాశాలు లేకుండా పోయాయి. కుప్పలుగా పోసిన పత్తిలో తేమ శాతం తగ్గడం లేదు. పత్తి విత్తనాలదీ దాదాపుగా అదే పరిస్థితి. అధిక వర్షాల కారణంగా పత్తిలో తేమ శాతం 25 నుంచి 30 వరకు వస్తుందని అంటున్నారు. పత్తి విత్తనాల్లో తేమశాతం 60 వరకు ఉంటోంది. దీంతో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.6,200 మించి ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
సీసీఐ రంగంలోకి దిగితేనే..
రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సీసీఐ రంగంలోకి దిగితే తప్ప పత్తి రైతులు పెట్టుబడి ఖర్చుల నుంచి బయటపడే దాఖలాలు కనిపించడం లేదు. నాగర్ కర్నూల్ జిల్లాలో 14 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నాగర్ కర్నూల్లో 4, కల్వకుర్తిలో 10, అచ్చంపేటలో 3 కేంద్రాలు ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడ్ పత్తి క్వింటాల్‌కు రూ.8,110, బి, సి గ్రేడ్లకు రూ.7710 వరకు చెల్లిస్తారు. తేమశాతం 8 నుంచి 12 లోపు ఉండాలనే నిబంధన విధించారు.
కేఎల్ఐ కాల్వ నీళ్లు, వానలతోనే నష్టం..
5 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టిన. కేఎల్ఐ కాల్వ నీళ్లు, ఎడతెరిపి లేని వర్షాలతో పొలం జాలు వారి పంట చేతికి రాలేదు. దీంతో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఉన్న కొంచెం పత్తి ఏరిద్దామంటే నీళ్లు ఉన్నాయని కూలీలు రావడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.-కుందేళ్ల శ్రీశైలం,
తిప్పాపూర్, ఉప్పునుంతల మండలం
నాలుగు ఎకరాల్లో 20 క్వింటాళ్లే వచ్చింది..
నాలుగు ఎకరాలలో పత్తి సాగు చేసిన. నీళ్లలో పంట మునిగి ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ఎకరాకు రూ.35 వేల వరకు ఖర్చు వచ్చింది. పత్తి అమ్ముకుంటే వచ్చే లాభం కంటే పెట్టుబడి ఖర్చు మీద పడేటట్లు ఉంది. సీసీఐ వాళ్లు సెంటర్లు ఓపెన్ చేస్తే మిగిలిన రైతులకైనా మేలు జరుగుతుంది. -గుడ్లనర్వ శేఖర్, మహదేవునిపేట, బిజినేపల్లి మండలం
