నల్గొండ, వెలుగు: బాల్యవివాహాలను అరికట్టేందుకు బాలిక విద్యను ప్రోత్సహించడమే సరైన పరిష్కార మార్గమని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ‘ఆశ్రిత’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ‘జాగ్రత్త’ పేరుతో రూపొందించిన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, విద్యపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. బాల్యవివాహాలు జరగకుండా ఉండాలంటే చదువే ఏకైక మార్గమన్నారు. సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, సీడీపీవో హరిత, ఆశ్రిత సంస్థ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలది కీలకపాత్ర
నల్గొండ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఫ్లయింగ్ స్క్వాడ్ స్టాటిక్ సర్వైలెన్స్ టీంల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్, బి చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఉదయాదిత్య భవన్ లో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టి, ఎస్ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
