- నాంపల్లి కోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు: ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఎస్‌బీఐ బ్యాంకును మోసం చేసిన భార్యభర్తలకు నాంపల్లి కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించింది. హైదరాబాద్ ఎర్రగడ్డ నేతాజీ నగర్‌కు చెందిన ఉప్పల దశరథ్ నేత (57), ఉప్పల లక్ష్మి బాయి(50) 2007లో సికింద్రాబాద్ ఎస్‌బీఐ ఎయిర్ కార్గో బ్రాంచ్ నుంచి రూ.24 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నారు. జీడిమెట్లలోని ఓ ఇండిపెండెంట్ హౌస్ పేరుతో నకిలీ సేల్ డీడ్, జీపీఏ సహా బ్యాంకుకు ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారు.
ఇలాంటివే మరికొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లను తనఖా పెట్టి ఎస్‌బీఐ మైసూర్, కూకట్‌పల్లి బ్రాంచ్, కెనరా బ్యాంక్ కుందన్‌బాగ్ బ్రాంచ్‌ల్లోనూ లోన్లు తీసుకున్నారు. లోన్ డబ్బులు తిరిగి చెల్లించకుండా బ్యాంకులను మోసం చేశారు. దీంతో ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు 2011లో సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ ఆధారంగా కోర్టు విచారణ జరిపి భార్యభర్తలకు జైలు శిక్ష విధించింది.
