రామాయంపేట, నార్సింగి మండలాల్లో.. నామినేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి : భారతి లక్పతి నాయక్

రామాయంపేట, నార్సింగి మండలాల్లో.. నామినేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలి : భారతి లక్పతి నాయక్

రామాయంపేట, వెలుగు: నామినేషన్ ప్రక్రియ పక్కాగా చేపట్టాలని ఎన్నికల సంఘం నియమాలను పాటించాలని సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సూచించారు. బుధవారం రామాయంపేట, నార్సింగి మండలాల్లోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రిజిస్టర్లు పరిశీలించారు.  ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని  సూచించారు. 

దాఖలైన నామినేషన్లకు సంబంధించిన అఫిడవిట్ లను ఏ రోజుకు ఆ రోజు నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తూ, జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలన్నారు.  ప్రతీ నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు.