ఇందిరమ్మ రాజ్యంలోనే నిజమైన ప్రజాపాలన : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

ఇందిరమ్మ రాజ్యంలోనే నిజమైన ప్రజాపాలన : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హుస్నాబాద్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలోనే నిజమైన ప్రజాపాలన నడుస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన భారీ ప్రజా సభలో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు. 

ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని, ఈ ప్రజాపాలన నిజమైన ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనమన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే నాలుగు పథకాలను విజయవంతంగా అమలు పరుస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. 

గత పదేళ్లుగా బీఆర్ఎస్​ పాలనలో పేదలకు ఇవ్వకుండా నిలిపివేసిన రేషన్ కార్డులను తమ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పేదలకు మంచి చేయాలనేదే ఇందిరమ్మ రాజ్యం ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంపై ఎంత ఆర్థిక ఒత్తిడి పెరిగినా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆ ఒత్తిడిని లెక్క చేయకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ అమలు చేసిందని కొనియాడారు. ఇచ్చిన హామీలను అమలు చేసిన సంతోషకరమైన సందర్భంలో ఈ సభ నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు.