సీఎం రేవంత్‌‌‌‌‌‌రెడ్డి కామెంట్లపై  బీజేపీ మహిళా మోర్చా నిరసన

సీఎం రేవంత్‌‌‌‌‌‌రెడ్డి కామెంట్లపై  బీజేపీ మహిళా మోర్చా నిరసన
  • గాంధీభవన్‌‌‌‌ ముట్టడికి యత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్ 

హైదరాబాద్, వెలుగు: హిందూ దేవుళ్లను కించపరిచేలా  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా, బీజేవైఎం నేతలు డిమాండ్​ చేశారు.  హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.  బుధవారం గాంధీ భవన్​ ముట్టడికి వారు ప్రయత్నించారు.  బీజేపీ స్టేట్ ఆఫీసు నుంచి  బయటకు రాగానే.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, బీజేపీ  కార్యకర్తలకు మధ్య వాగ్వాదం,  తోపులాట జరిగింది. అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేసి, నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ.. హిందూ దేవుళ్లపై రేవంత్‌‌‌‌రెడ్డి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.

ఓట్ల కోసం దేవతలపై ఒట్లు వేసి.. ఇప్పుడు తాగుబోతులు, తిండిబోతులతో పోల్చుతూ అవమానిస్తారా? అని ప్రశ్నించారు.  స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. హిందువులను అవమానించడం సరికాదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ అన్నారు. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. 

అణచివేస్తే ఊరుకోం: ఎన్. రాంచందర్ రావు

శాంతియుత నిరసనలపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు అమానుషమని, ఇది ప్రజాస్వామ్యానికే మచ్చ అని అన్నారు. అధికారం ఉందని విర్రవీగితే కాంగ్రెస్‌‌‌‌కు ప్రజలే బుద్ధి చెబుతారని, రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.