- మంత్రి పొన్నం విజ్ఞప్తులకు వెంటనే నిధుల మంజూరు
- భారీ జనం హాజరుతో కాంగ్రెస్‌లో జోష్
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్‌ను ఎలాంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని, ప్రతి రంగంలో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం హుస్నాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
గత పదేళ్ల పాలనలో హుస్నాబాద్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని సీఎం విమర్శించారు. పక్కనే ఉన్న గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల అభివృద్ధి శరవేగంగా సాగుతుంటే, హుస్నాబాద్ ప్రాంతంలోని గౌరవెల్లి రిజర్వాయర్, గండిపల్లి ప్రాజెక్టులు ఎందుకు పూర్తికాలేదో ప్రజలే ఆలోచించాలన్నారు. ఈ రెండు కీలక ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను తమ ప్రభుత్వం పూర్తిగా భుజాన వేసుకుందన్నారు.
గౌరవెల్లి పూర్తైతే హుస్నాబాద్‌తో పాటు మూడు జిల్లాల పరిధిలోని లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని చెప్పారు. పొన్నం విజ్ఞప్తి చేసిన రింగ్ రోడ్డు, నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో సహా ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
సీఎం ఢిల్లీ పర్యటన కారణంగా సభ రెండు గంటలు ఆలస్యమయినా నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు ఓపికగా నిరీక్షించారు. సీఎంరాకతో పట్టణమంతా కాంగ్రెస్ జెండాలతో నిండిపోయి మూడు రంగుల వాతావరణం నెలకొంది. సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్‌లో నూతన జోష్ నెలకొంది.
