
- అర లీటరు నానో యూరియా.. బస్తా యూరియాతో సమానం
- పంటల దిగుబడిలో 8 శాతం అధికంగా వచ్చే చాన్స్
- గత నెల వరకే 2.24 లక్షల టన్నుల యూరియా లోటు
- నానోయూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన
హైదరాబాద్/ సిద్దిపేట, వెలుగు : రాష్ట్రంలో సాధారణ యూరియా కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగించేందుకు రైతులకు అగ్రికల్చర్సైంటిస్టులు, ఆఫీసర్లు అవగాహన కల్పిస్తున్నారు. లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోనూ యూరియాతో సమానమైన నత్రజని ఉంటుంది. పైగా దీని రవాణా, నిల్వ, వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. డిమాండ్మేరకు యూరియా అందుబాటులో లేని పరిస్థితుల్లో నానో యూరియా వినియోగమే కొరతకు పరిష్కారంగా కనిపిస్తుంది.
మార్కెట్, ఆన్ లైన్ లోనూ అందుబాటులో..
లీటరు నీటిలో 4 ఎంఎల్ నానో యూరియాను కలిపి స్ప్రే చేయాలి. డ్రోన్ ద్వారా వినియోగిస్తే 10 లీటర్ల సామర్థ్యం ఉంటే 250 ఎంఎల్, 20 లీటర్ల సామర్థ్యం ఉంటే 500 ఎంఎల్ సరిపోతుంది. పంట వేసిన తర్వాత మొదట సాధారణ యూరియా, డీఏపీ గానీ వాడాలని, పిలకలు వచ్చే దశ నుంచి నానో యూరియా స్ప్రే చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. పత్తి, కంది వంటి పంటలకు దుక్కుల సమయంలోనే సాధారణ యూరియా వాడి, తర్వాత నానో యూరియా స్ప్రే చేయాలని ఇఫ్కో కంపెనీ పేర్కొంటుంది.
నానో యూరియా చిన్న డబ్బాల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇఫ్కో కంపెనీకి చెందిన నానో యూరియా మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. యూరియా బస్తా రేటు రూ.270 కాగా, అర లీటర్ నానో యూరియా రూ.225కు లభిస్తుంది. ఇది ఎకరం పంటకు సరిపోతుంది. ఐదేండ్ల కింద 94 రకాల పంటలపై 11 వేల ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా నానో యూరియాను పరీక్షించారు.
దీని వాడడం వల్ల సాధారణ యూరియాతో పోలిస్తే 8 శాతం ఎక్కువ దిగుబడి వచ్చినట్టు తేలింది. తెలంగాణ జయశంకర్ అగ్రికల్చర్వర్సిటీ, ఐకార్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్టడీల్లోనూ ఇవే ఫలితాలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా నానో యూరియాను 1985లో ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్‌లో చేర్చింది.
అవగాహన కొరవడడంతోనే అడ్డంకి..
వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 1.34కోట్ల ఎకరాల్లో సాగు జరుగుతుందని అంచనా. కాగా ఇప్పటికే 90 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ సీజన్‌లో 12 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. అయితే, కేంద్రం 9.80 లక్షల టన్నులు మాత్రమే కేటాయించింది. గత నెల వరకే 2.24లక్షల టన్నులు కోత పెట్టింది. ఈనెల సరఫరా చేయాల్సిన 1.70లక్షల టన్నులు ఇంకా ఇవ్వలేదు. దీంతో యూరియా కొరత ఏర్పడింది. ఇక నానో యూరియా వాడడం ద్వారా యూరియా వినియోగాన్ని 25- నుంచి 40 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. నానో యూరియాపై రైతుల్లో అవగాహన లేకపోవడంతో యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో కంపెనీ సంయుక్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి డ్రోన్ల ద్వారా ఎలా స్ప్రే చేయాలో ప్రాక్టికల్‌గా చూపిస్తున్నారు. ఆయా కార్యక్రమాల ఫలితంగా రైతులు క్రమంగా నానో యూరియా వైపు మొగ్గు చూపుతున్నారు.
కాలుష్యాన్ని తగ్గించి.. దిగుబడిని పెంచుతుంది
45 కిలోల యూరియా బస్తాకు 500 ఎంఎల్ నానో యూరియా సమానం. రేటు కూడా దాదాపు సమానమే. పంటల మీద యూరియా చల్లితే సగం నత్రజని మాత్రమే మొక్కలకు చేరుతుంది. మిగిలిన యూరియా నేల, నీటిలో కలిసి కాలుష్యాన్ని పెంచుతుంది. అదే నానో యూరియాను స్ప్రే చేయడం ద్వారా నత్రజని నేరుగా మొక్కలకు చేరుతుంది. ఇది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా 8 శాతం వరకు దిగుబడి పెంచుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అన్ని రకాల పంటలకు నానో యూరియా వాడుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పేర్కొంటున్నారు.
మంచి దిగుబడి వస్తుంది
నానో యూరియా వాడకంతో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటల్లో మంచి దిగుబడి వస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందుతున్నాం. నానో యూరియాను మొక్కలు బాగా గ్రహించడంతో ఫలితాలు వెంటనే కనిపిస్తున్నాయి. తమ్మలి స్వామి, రైతు, అనంతగిరి పల్లి, సిద్దిపేట జిల్లా