
- ఉడాయించిన షాప్ ఓనర్
నర్సాపూర్, వెలుగు: పట్టణంలోని చేతన్ మేన్స్ వేర్ బట్టల షాపు ఓనర్ 2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ రీల్ పోస్ట్ చేశాడు. సోమవారం ఉదయం 11 నుంచి 11.10 గంటల వరకు మాత్రమేనని అందులో పేర్కొన్నాడు. ఈ అవకాశాన్ని నర్సాపూర్ చుట్టుపక్కల వారంతా ఉపయోగించుకోవాలని కోరాడు. సోషల్ మీడియాలో ఆ పోస్ట్ చూస్తుండగానే వైరల్ అయిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు షాప్ వద్దకు యువకులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఉన్నది 10 నిమిషాలే. చూస్తే భారీగా జనం ఉన్నారు. దీంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఇదంతా చూసిన షాపు ఓనర్ చేతన్ దుకాణం బంద్ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు షాప్ వద్దకు చేరుకున్నారు. యువకులను అక్కడి నుంచి పంపించేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాప్ ఓనర్ చేతన్ కోసం గాలిస్తున్నారు.