బాదుడికి రెడీ : జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెరగనున్నాయా.. క్లారిటీ ఇవ్వని హైవే అథారిటీ

 బాదుడికి రెడీ : జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెరగనున్నాయా.. క్లారిటీ ఇవ్వని హైవే అథారిటీ

జూన్ 2వ తేదీ 2024 నుంచి జాతీయ, రాష్ట్ర రహదారుల్లోని టోల్ బూత్ ఛార్జీలు పెరగనున్నాయా.. పెరిగితే ఎంత పెరగనుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీనిపై ఇప్పటి వరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ ఛార్జీల మార్పు ఉంటుంది. 

ఈసారి ఎన్నికలు జరుగుతుండటంతో.. టోల్ ఛార్జీల పెంపును నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా 20214, జూన్ ఒకటో తేదీ వరకు ప్రస్తుతం ఉన్న ధరలనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. జూన్ ఒకటో తేదీన పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది.. అదే రోజున ఉత్తర్వులు తేదీ ముగుస్తుంది.. సో జూన్ 2వ తేదీ నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే జూన్ 2వ తేదీ నుంచి టోల్ ఛార్జీల పెంపుపై మాత్రం ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు విడుదల కాలేదు.

  టోల్ ఛార్జీలను సగటున 5శాతం పెంచి వసూలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జాతీయ రహదారులపై  దాదాపు 855 వరకు టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఉదాహరణకు  హైదరాబాద్‌-విజయవాడ (65) నేషనల్ హైవేను తీసుకుంటే.. ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. 

కార్లు, వ్యాన్‌లకు ఒక వైపు ప్రయాణానికి రూ.5, రానూపోనూ కలిపి రూ.10, తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒక వైపు రూ.10, ఇరు వైపులా అయితే రూ.20, అదే విధంగా బస్సు, ట్రక్కులకు రూ.25, రూ.35, భారీ రవాణా వాహనాల అయితే రూ.35, రూ.50 చొప్సున పెంచారు. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఉంటుంది.