సస్పెన్స్ థ్రిల్లర్​లా కౌర్ నామినేషన్

సస్పెన్స్ థ్రిల్లర్​లా కౌర్ నామినేషన్

ముంబై :  బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రాణా నామినేషన్ ప్రక్రియ సినిమా క్లైమాక్స్​ను తలపించేలా ఉత్కంఠగా సాగింది. క్యాస్ట్ (కుల) సర్టిఫికెట్ అంశంలో సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆమె ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకేరోజు (ఏప్రిల్4) సుప్రీంకోర్టులో కుల ధృవీకరణపై విచారణ, నామినేషన్ వేసేందుకు చివరి రోజు కావడంతో కౌర్ నామినేషన్ అంశం ఆసక్తికరంగా మారింది. తన అభ్యర్థిత్వానికి సుప్రీంకోర్టు తీర్పు కీలకం కావడంతో కౌర్.. స్థానిక దసరా గ్రౌండ్​లో  మహారాష్ట్ర  డిప్యూటీ  సీఎం దేవేంద్ర  ఫడ్నవీస్​తో పాటు తన అనుచరులతో గురువారం ఉదయం నుంచి 
మధ్యాహ్నం దాకా ఎదురుచూడాల్సి వచ్చింది.

అసలేం జరిగిందంటే..

కౌర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ  శివసేన నేత ఆనందరావు అద్సుల్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ను బాంబే హైకోర్టు 2021 జూన్ 8న విచారించింది. నవనీత్ కౌర్ ఎన్నికల సమయంలో  తప్పుడు కుల ధ్రవీకరణ పత్రాలు ఉపయోగించారంటూ తీర్పు ఇచ్చింది. మోసపూరితంగా వ్యవహరించినందుకు రూ.2 లక్షల ఫైన్ విధించింది. దీనిపై కౌర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ గురువారం జరిగింది. సరిగ్గా 11:58 గంటలకు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

ఆనందం వెల్లివిరిసింది

1100 కిలోమీటర్ల దూరంలో జరిగే సుప్రీం కోర్టు విచారణతో.. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న నవనీత్ కౌర్, ఆమె అనుచరుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దసరా గ్రౌండ్ వేదికపైకెక్కిన ఫడ్నవీస్.. న్యాయ పోరాటంలో కౌర్ గెలుపొందారని ప్రకటించారు. దీంతో కౌర్ తన మద్దతుదారులు, బీజేపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి గురువారం మధ్యాహ్నం 1:42గంటలకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇలా.. నవనీత్ కౌర్ నామినేషన్ ప్రాసెస్ చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది.