
న్యూఢిల్లీ: తాను అనుకున్న విధంగా ఈ సీజన్‌ను ముగించలేకపోయానని ఇండియా జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా అన్నాడు. అయితే వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ నెల ఆరంభం నుంచి వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డ నీరజ్.. టోక్యోలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచాడు. దీంతో నీరజ్ ప్రదర్శన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే వెన్ను నొప్పి వల్లే తాను రాణించలేకపోయానని ఇండియన్ ప్లేయర్ వెల్లడించాడు.
‘వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నేను అనుకున్న విధంగా రాణించలేకపోయా. ఈ సీజన్‌ను చాలా బలంగా ముగించాలని అనుకున్నా. కానీ చాలా సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమించే క్రమంలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. అందులో వెన్ను నొప్పి ఒకటి. ఇండియా తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు నేను ఎప్పుడూ రెడీగా ఉంటా. అందుకే వచ్చే ఏడాది మరింత బలంగా సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మొత్తానికి టోక్యో ప్రదర్శన నాది కాదు’ అని నీరజ్ వ్యాఖ్యానించాడు. తనకంటే మెరుగైన పెర్ఫామెన్స్ చూపెట్టిన సచిన్ యాదవ్‌పై నీరజ్ ప్రశంసలు కురిపించాడు. రాబోయే రోజుల్లో అతను మరింత రాటుదేలుతాడని చెప్పాడు.