కొత్త ప్రభుత్వం..ఉచిత విద్యపై దృష్టి పెట్టాలె

కొత్త ప్రభుత్వం..ఉచిత విద్యపై దృష్టి పెట్టాలె

ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా ఏమున్నది గర్వకారణం , అన్ని పార్టీల మేనిఫెస్టోల నిండా గ్యారెంటీలు, భరోసాలు, ఆసరాలు, ఉచితాలే ! అభివృద్ధి, సంక్షేమం అంటున్నారు, కానీ అభివృద్ధి అంటే పెన్షన్లు, రాయితీలేనా! సంక్షేమం అంటే బీమాలు, బంధులేనా? బీఆర్​ఎస్​ మేనిఫెస్టోలో అయితే, కనీసం విద్య ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. విద్య పట్ల బీఆర్​ఎస్​ నిర్లక్ష్య ధోరణి దాని మేనిఫెస్టోలోనూ చాటుకోవడం గమనించొచ్చు.  నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ విద్యాసంస్థలను పటిష్టం చేస్తామని గానీ, జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం స్థాపించి, ప్రతి విశ్వవిద్యాలయంలో అన్ని శాఖలను నెలకొల్పి, అధ్యాపకుల నియామకాలు చేసి, పరిశోధనలు జరిగేలా చూస్తామని,  పరిశోధనల ద్వారా విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా రూపొందేలా చూస్తామని నిజానికి ఏ పార్టీ చెప్పడం లేదు. 

అధికారంలో ఉన్న పార్టీ ‘ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ’ అని మొదటిసారి ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఉచిత విద్య 1002 గురుకుల పాఠశాలల ద్వారా 5లక్షల 50 వేల మందికే పరిమితమైంది. గురుకులాల్లో  ఐదో తరగతి నుంచి 10/12 వ తరగతి వరకు బోధన ఉండడంతో , 4 వ తరగతి వరకు ప్రాథమిక విద్య ప్రైవేటు పరమైంది.  ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. 62 లక్షల మంది విద్యార్థులు చదివే పాఠశాల విద్యలో ఐదున్నర లక్షలకే గురుకులాలు పరిమితం అయితే ఈ పదేండ్లుగా  మిగతా 55 లక్షల మంది విద్యార్థులు చదువు గతి ఏమిటనేది ఏ పార్టీ ప్రణాళికలో చర్చ లేదు! 

విద్యపై కాంగ్రెస్​ హామీలు

కాంగ్రెస్​ పార్టీ మేనిఫెస్టో మాత్రం ఐదు లక్షల విద్యా భరోసా కార్డు,  ఫ్రీ ఇంటర్నెట్ , మండలానికి ఒక ఉన్నత పాఠశాల, ఉచిత రవాణా, ఫీజు రియింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​లను  పెంచి సకాలంలో అందించడం, విదేశీ విద్యకు 25 లక్షల ఆర్థిక సహాయం, ప్రతి గ్రామానికి ప్రాథమిక పాఠశాల, మండల కేంద్రంలో హైస్కూలు, జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల, జిల్లాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల, పార్ట్ టైం లెక్చరర్లకు వేతనాల పెంపు వంటి అంశాల ప్రస్తావన ఉంది. కానీ, కొత్తగా స్థాపించే ఈ విద్యాసంస్థలను ప్రభుత్వమే నిర్వహిస్తుందనిగాని, విద్య అందించడానికి నిర్దిష్ట విధాన ప్రతిపాదన లేదు.  కాకపోతే విద్య విషయంలో ఊసే ఎత్తని  బీఆర్​ఎస్ ​కన్నా కాంగ్రెస్​ మేనిఫెస్టో చాలామేరకు నయమనే చెప్పాలి. విద్యారంగంపై ఖర్చును ఒక శాతం నుంచి నాలుగు శాతానికి పెంచడం, చేయూత పథకం ద్వారా లాప్​టాప్​ అందించడం, విద్యార్థి చేయూత ద్వారా ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ఉపాధ్యాయుల నియామకాలు వంటి ప్రస్తావనలు చేసింది. 

విద్యా వ్యాపారం

రాష్ట్రంలో విద్యా వ్యాపారం పెరిగిపోయింది. పాఠశాల విద్యలో 52 శాతం విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారు.  ప్రభుత్వ పాఠశాలు ఆదరణ లేకుండా నిర్వీర్యం అయిపోతున్నాయి. హేతుబద్ధీకరణ పేరుతో వేలాది పాఠశాలలు మూతపడుతున్నాయి. పేద పిల్లలకు పాఠశాలలు అందుబాటులో లేక బాల కార్మికులుగా మారుతున్నారు. పదేండ్ల నుంచి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్ తగ్గిపోతోంది. విద్యారంగంలో మితిమీరిన ప్రపంచ బ్యాంకు జోక్యం గురించిగానీ,  నాణ్యత గల చదువుకు నోచుకోని పేద విద్యార్థుల గురించి గాని ఏ రాజకీయ పార్టీ చర్చ చేయడం లేదు. విద్యారంగానికి ప్రభుత్వ నిధులను కేటాయించడానికి బదులు, ప్రైవేటు పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని, ప్రభుత్వేతర  పాత్రధారుల ప్రవేశానికి వీలు కల్పించాలని ప్రభుత్వాలపై తెచ్చే ఒత్తిడి గురించి గానీ చర్చ లేదు. 

రెండు దశాబ్దాలుగా జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డిపెప్) పేరుతో జరిగిన కార్యక్రమాల అమలుపై సమీక్ష లేకుండా , 2002 నుంచి ప్రారంభించిన  సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాలపై చర్చ లేదు. ప్రైవేట్ రంగానికి ప్రవేశం కల్పించడం ప్రపంచ బ్యాంకు వ్యూహంలో కీలకమైంది. కానీ అందులో విద్యా నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యం ఏమీ లేదు.  దాని ఫలితంగా వెనుకబడిన,పేద వర్గాల పిల్లలంతా మరింతగా విద్యకు దూరమవుతున్న విషయంపై ఏ సమీక్ష, ఏ చర్చ లేదు. ఈ విషయాలు ఏవీ చర్చించకుండా అందరికీ నాణ్యమైన విద్య ప్రమాణాలతో కూడిన విద్య అందించే విధానాలు రూపొందించడం కుదరదు.  జాతీయ ఆదాయంలో విద్యకు 6% నిధులు కేటాయించాలని, రాజ్యాంగ వెలుగులో కామన్ స్కూల్ విధానం కావాలని కొఠారి కమిషన్ చేసిన సిఫార్సులు కూడా మేనిఫెస్టోలో చోటు చేసుకోలేదు. విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి. కానీ, సామాజిక ఆకాంక్షలను కాదని, విశాల లక్ష్యాల సాధనలో భాగంగా మార్కెట్,  పరిశ్రమల అవసరాలు తీరుతాయనే అవగాహన గాని, విద్య లక్ష్యాలు రూపొందించే ఆలోచనలేవి మేనిఫెస్టోలలో లేవు. 

క్షీణిస్తున్న విద్యా ప్రమాణాలు 

ఇటీవల జాతీయ విద్యా పరిశోధన సంస్థ, నేషనల్ అచీవ్​మెంట్ సర్వేలు క్షీణిస్తున్న పాఠశాల విద్యార్థుల ప్రమాణాల గురించి ఆందోళన వ్యక్తం చేశాయి ఈ విషయాలను క్షుణ్ణంగా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చర్చించడానికి బదులుగా రాయితీలు రియింబర్స్​మెంట్ వంటి అంశాల మీదనే కేంద్రీకరించాయి. విద్య ఆర్థిక రంగానికి కావలసిన వివిధ స్థాయిల మానవశక్తిని అందిస్తుంది జాతీయ స్వయం పోషకత్వానికి పరిశోధనల అభివృద్ధికి విద్య ఆధారభూతంగా ఉంటుంది అందువలన అందరికీ ప్రమాణాలతో కూడిన విద్యను సమానంగా అందించాలనే ఉదాత్త లక్ష్యాన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి.

- కే. వేణుగోపాల్,పూర్వ అధ్యక్షుడు, ఏపీటీఎఫ్