33 ఏళ్ల తర్వాత.. పశ్చిమ కనుమల్లోకి కొత్త సీతాకోకచిలుక జాతులు

33 ఏళ్ల తర్వాత.. పశ్చిమ కనుమల్లోకి కొత్త సీతాకోకచిలుక జాతులు

భారతదేశంలోని పశ్చిమ కనుమల పర్వత శ్రేణిలో వందలాది సీతాకోకచిలుక జాతులు జీవవైవిధ్యానికి ప్రతిబింబంగా నిలుస్తాయి. ఇటీవల పశ్చిమ కనుమలలో కనిపించే జాబితాలో ఓ కొత్త సీతాకోకచిలుక వచ్చి చేరింది. దీంతో ఈ సంఖ్య ఇప్పుడు 337కి చేరుకుంది. జనవరి 13 నాటి పత్రికా ప్రకటన ప్రకారం, మెగామలై డివిజన్‌లోని శ్రీవిల్లిపుత్తూరు మెగామలై టైగర్ రిజర్వ్ లో ఓ వెండి రంగు గీతలు గల సీతాకోకచిలుక "సిగరిటిస్ మేఘమలైయెన్సిస్" కనుగొన్నారు. ఈ సీతాకోకచిలుకకు ఈ ప్రాంతం పేరే పెట్టారు, మెగామలై అంటే "మేఘ పర్వతం" అని అర్ధం. ఇటీవలే ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు సీతాకోకచిలుకల జాతుల ఫొటోను Xలో పంచుకున్నారు.

తమిళనాడులోని మెగామలైలోని శ్రీవిల్లిపుత్తూరు టైగర్ రిజర్వ్‌లో పరిశోధకులు కొత్త జాతి సిల్వర్‌లైన్ సీతాకోకచిలుకను కనుగొన్నారని సుప్రియా సాహు చెప్పారు. డాక్టర్. కాలేష్ సదాశివం, తిరురు రామసామి కామయ, డా.సిపి రాజ్‌కుమార్ తేనిలో ఉన్న వనం అనే NGO నుండి ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించారని, 33 ఏళ్ల తర్వాత పశ్చిమ కనుమల్లో కొత్త జాతి సీతాకోక చిలుకను కనుగొన్నారన్నారు. ఈ ఆవిష్కరణతో పశ్చిమ కనుమలలోని మొత్తం సీతాకోక చిలుకల సంఖ్య 337 జాతులకు చేరుకుంటుందని చెప్పారు.

ఈ పోస్ట్ పై స్పందిస్తోన్న నెటిజన్లు.. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం దక్కుతుంది సుప్రియా జీ అని అంటున్నారు. నీలి సీతాకోకచిలుకలు చాలా అరుదని, అవి కలలోనే కనిపిస్తుంటాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.