- 10 నెలల్లో 137 మంది మృతి
- డిఫెన్సివ్ డ్రైవింగ్ పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
నిర్మల్, వెలుగు: రోజురోజుకూ పెరుగుతున్న యాక్సిడెంట్స్ను నివారించేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతుండటమే కాకుండా తీవ్ర గాయాలపాలై అంగవైకల్యానికి గురవుతున్నారు. ఫలితంగా బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతీ నెల 15 మందికి తగ్గకుండా యాక్సిడెంట్స్లో మరణిస్తుండగా 60 మందికి పైగా గాయపడుతున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ జానకి షర్మిల వారం రోజుల క్రితం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్స్జరగడానికి కారణాలతోపాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించారు. అతివేగంగా డ్రైవింగ్ చేయడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, మూలమలుపుల వద్ద అజాగ్రత్తగా వెళ్లడం వంటివి ప్రమాదాలకు కారణాలని తేల్చారు.
డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమం
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఆధ్వర్యంలో కొత్త యాక్షన్ ప్లాన్రూపొందించారు. ఇందులో భాగంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, పరిసరాలను గమనించడం, ఇతరుల తప్పిదాలను ముందుగానే అంచనా వేయడం వంటి టెక్నిక్ లు ఇందులో కీలక అంశాలు. రాంగ్రూట్లో వచ్చే వాహనాలను గుర్తించడం, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేసే వారికి దూరంగా ఉండటం, రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాల డోర్లు అకస్మాత్తుగా తెరుచుకునే సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పై పోలీసులు ఊరూరా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.
522 రోడ్డు ప్రమాదాలు
జిల్లాలో గత 10 నెలల్లో మొత్తం 522 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 139 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 612 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా 27 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలని వాహనదారులకు సూచిస్తున్నారు.
