- ఎక్స్పర్మెంట్స్, బ్రెయిన్ గేమ్స్ తో అదరగొట్టిన స్టూడెంట్స్
- ప్రైజ్ కొట్టడమే టార్గెట్‍గా పోటాపోటీ ఎగ్జిబిట్లు
- వరంగల్ ఎన్‍ఐటీలో ముగిసిన సాంకేతిక సృజనోత్సవ వేడుకలు
వరంగల్/కాజీపేట, వెలుగు : వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రెండురోజులుగా నిర్వహించిన ‘టెక్నోజియన్–25’ స్టూడెంట్ల క్రియేటివిటీ, ఎక్స్పర్మెంట్లకు వేదికగా నిలిచింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 7 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ వారిలోని సాంకేతిక సృజనాత్మకతను ఎగ్జిబిట్ల రూపంలో ప్రదర్శించారు.
హెలికాప్టర్ నుంచి రాకెట్ల వరకు, ఆధునాతన బైక్ నుంచి కొండలు, గుట్టలెక్కే రేసింగ్ కార్ల వరకు రూపకల్పన చేసి పేరొందిన సంస్థల్లో ఉండే ఇంజినీర్లకు సవాల్ విసిరారు. రెండురోజులపాటు జరిగిన టెక్నోజియన్ శనివారం సాయంత్రంతో ముగిసింది.
రెండోరోజు బ్రెయిన్ టెస్ట్ గేమ్స్..
రెండురోజుపాటు నిర్వహించిన టెక్నోజియన్లో మొదటిరోజు హెలికాప్టర్లు, లాంఛర్లు, రాకెట్లు, ట్యాంకర్లు వంటి అప్‍గ్రేడ్ చేసిన ఈవెంట్లను ప్రదర్శనలో పెట్టారు. రెండోరోజైన శనివారం మెదళ్లకు పనిచెప్పే బ్రెయిన్ టెస్ట్ గేమ్స్‌కు నిర్వాహకులు ప్రాధాన్యత ఇచ్చారు. లెట్‍థెమ్ కుక్, రోబోట్ సుమో వార్, మెటా డాట్, క్రికెట్ ఆటను చీకట్లో ఆడించే 'నియాన్ క్రికెట్' క్విజ్ వంటి పోటీలు నిర్వహించారు.
విజయానికి ఆలోచన, ఆవిష్కరణ ముఖ్యం..
21వ శతాబ్దంలో విజయానికి కేవలం కష్టపడి పనిచేస్తే సరిపోదని, ఆలోచనలు, ఆవిష్కరణలతో విజయం సాధించగలరని రక్షణ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలలత అన్నారు. టెక్నోజియాన్ ముగింపు కార్యక్రమానికి బాలలత చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. జీవితంలో ప్రతి దశలో నిరంతర కృషి, స్వీయ విశ్వాసం అవసరమన్నారు.
క్రమశిక్షణ, నిబద్ధత, ప్రత్యేక దృష్టి ద్వారా సవాళ్లను అధిగమించవచ్చని చెప్పారు. చాలామందికి తాము చేస్తున్న పని ఇష్టం ఉండదని, ఇష్టమైన వృత్తిని ఎంచుకున్నప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని, కొత్త ఆలోచనలకు నూతన ఆవిష్కరణల కోసం సమయం కేటాయించాలని సూచించారు.
బురదలో రయ్‍మంటది..
వరంగల్ ఎన్‍ఐటీ మెకానికల్ (టీం మెకహాలిక్స్) స్టూడెంట్స్ 'డ్యూ–250 ఇంజిన్'తో తయారు చేసిందే ఈ 'క్వాడ్ బైక్'. ఇది మాములు ప్రదేశాల్లో నిర్వహించే రేస్ కాంపిటీషన్లో జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టడమే కాకుండా కొండలు ఎక్కడం, బురదలోనూ రయ్ మనడంలో స్పెషల్ గుర్తింపు పొందింది.
నిట్ స్టూడెంట్లు కేవలం నాలుగు నెలల్లోనే పూర్తిగా క్యాంపస్ గదుల్లోనే దీనిని రూపొందించారు. మల్టీ వెహికల్‍గా ఇప్పటికే ఇది వివిధ కాంపిటీషన్లలో గుర్తింపు పొందింది. గత నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్‍లో నిర్వహించిన 'క్వాడ్ టార్క్–2025’ ఈవెంట్‍లో 40కి పైగా వెహికల్స్‌ను కాదని ఆలిండియా ఓవరాల్ రన్నరప్ బహుమతి గెలుచుకుంది.
ఏరో మోడలింగ్..అదుర్స్
ఇండియన్ ఎయిర్ఫోర్స్ లేదంటే ఎన్సీసీ కెడేట్లకు శిక్షణ ఇచ్చే ఎయిర్ వింగ్ విభాగంలో మాత్రమే కనిపించే ఏరో మోడలింగ్ విభాగంలో ఏటేటా విద్యార్థుల మధ్య కాంపిటీషన్ పెరుగుతోంది.
విద్యార్థులు కలప, ఇంజిన్, చక్రాలతో అచ్చమైన విమానం మాదిరి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేస్తున్నారు. పోటీలో భాగంగా ఆపరేటింగ్ మిషన్ ద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే టేకాఫ్ చేసి గాల్లో క్రమపద్ధతిలో చక్కర్లు కొట్టించాలి. ల్యాండింగ్ సమయంలో నిర్ణీతలు ఏర్పాటు చేసిన సర్కిల్స్‌లో మాత్రమే సురక్షితంగా దించాల్సి ఉంటుంది.
విడగొట్టిన స్పేర్ పార్ట్స్.. సరిచేయాలే..
మెకానికల్ కిట్ అసెంబ్లీ పేరుతో నిర్వహించిన బ్రెయిన్ టెస్ట్ గేమ్ విద్యార్థుల మెదళ్లను జెట్ స్పీడ్‌తో పరుగులెత్తించింది. నిట్ మెకానికల్ ఇంజినీర్ స్టూడెంట్లు వివిధ రూపాల్లో విడగొట్టిన వాహనాలు, ఇంజిన్లు, స్పేర్ పార్ట్స్‌ను ముక్కలు.. ముక్కలుగా ఒక బాక్స్‌లో వేశారు. వాటి ఒరిజినల్ రూపం తెలిపే ఫొటో ఇచ్చి వాటిని క్రమపద్ధతిలో సెట్ చేసే సమయాన్ని లెక్కించారు. దీంతో పోటీలో పాల్గొన్న వారు చేతులతోపాటు వారి బ్రెయిన్‍కు పనిచెప్పాల్సి వచ్చింది.
