పెళ్లి వయస్సు రాకున్నా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!

పెళ్లి వయస్సు రాకున్నా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు: రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు!

రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాకు చెందిన ఓ యువ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహ వయస్సు రాకపోయినప్పటికీ ఇద్దరు సమ్మతి కలిగిన అడల్ట్స్(Consenting Adults) లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండవచ్చని తాజాగా కోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు కూడా కోర్టు చెప్పిన తీర్పుతో అయోమయానికి గురవుతున్నారు. 

సాధారణంగా దేశంలో మహిళలకు వివాహ వయస్సు 18 ఏళ్లుగా నిర్ణయించగా.. పురుషులకు 21 ఏళ్లుగా ఉంది. అయితే 18 ఏళ్లు నిండిన తర్వాత స్త్రీ, పురుషులిద్దరూ చట్టబద్ధంగా వయోజనులుగా(Adults)గా పరిగణించబడతారు. దీంతో కోటకు చెందిన18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో అక్టోబర్ 27, 2025న లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కోసం ఇద్దరూ అంగీకరించినట్లు ఆ జంట కోర్టుకు తెలిపింది.

జస్టిస్ అనూప్ ధండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ప్రతి పౌరుడికి జీవించే హక్కు (Right to Life), వ్యక్తిగత స్వేచ్ఛ (Personal Liberty) హక్కు హామీ ఇవ్వబడుతున్నాయని తమ తీర్పులో వెల్లడించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరి.. సదరు యువకుడికి 21 ఏళ్లు నిండలేదు కాబట్టి అతను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేడని, అందువల్ల అతన్ని లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటానికి అనుమతించకూడదని న్యాయస్థానం ముందు వాదనలు వినిపించారు. ఈ వాదనను తోసిపుచ్చిన జస్టిస్ ధండ్.. పిటిషనర్లు చట్టప్రకారం పెళ్లికి అర్హులు కానంత మాత్రాన, వారి ప్రాథమిక హక్కులను వారికి దూరం చేయలేమని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి జీవితాన్ని, స్వేచ్ఛను పరిరక్షించాల్సిన రాజ్యాంగ విధి రాష్ట్రంపై ఉందని స్పష్టం చేశారు. 

లివ్-ఇన్ రిలేషన్‌షిప్ చట్టవిరుద్ధం కాదు..

భారతీయ చట్టం ప్రకారం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు చట్టవిరుద్ధం(illegal) కాదని, అలా అని అది నేరం(offence) కూడా కాదని రాజస్థాన్ కోర్టు తేల్చి చెప్పింది. దీంతో జంట తమ పిటిషన్‌లో పేర్కొన్న బెదిరింపుల గురించి దర్యాప్తు చేసి అవసరమైతే వారికి రక్షణ కల్పించాలని భిల్వారా, జోధ్‌పూర్ రూరల్ ఎస్పీలను న్యాయస్థానం ఆదేశించింది. మెుత్తానికి తాజా తీర్పుతో పెళ్లి వయస్సు నిబంధనలతో సంబంధం లేకుండా.. అడెల్ట్స్ వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయ హక్కులకు రాజస్థాన్ హైకోర్టు మరోసారి పెద్దపీట వేసింది.