
ఖైరతాబాద్, వెలుగు: తనను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ సస్పెండ్ చేయలేదని, ఇప్పటికీ అధిష్ఠానానికి అందుబాటులో ఉన్నానని మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ఐఎన్టీయూసీ(ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ప్లీనరీకి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాట్లాడి, ఒప్పించి తెలంగాణ ప్రకటన చేయించానన్నారు. పార్టీలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెత్తు పోకడలపై తొందరలోనే ప్రెస్ మీట్ పెడతానన్నారు. సీఎం కేసీఆర్ దళితులను, గిరిజనులను, బీసీలను మోసం చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింతగా పోరాడాలని ఐఎన్టీటీయూసీకి సూచించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంజ శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడు క్రిష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు రాములు నాయక్, రంగారెడ్డి, యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య, దండి సుధాకర్ గౌడ్, లీగల్ అడ్వయిజర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.