IND vs PAK: పాక్ ఓపెనర్ మెరుపులు.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్

IND vs PAK: పాక్ ఓపెనర్ మెరుపులు.. టీమిండియా ముందు బిగ్ టార్గెట్

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్ లో ఇండియా బౌలర్లు తడబడ్డారు. ఆదివారం (సెప్టెంబర్ 21) భారీ హైప్ తో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ బ్యాటింగ్ లో రాణించింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (58) హాఫ్ సెంచరీకి తోడు మిగిలిన వారు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టీమిండియా ముందు ఒక మాదిరి టార్గెట్ ను సెట్ చేసిన పాక్.. బౌలింగ్ లో ఎంతవరకు పోరాడుతుందో చూడాలి. ఇండియా బౌలర్లలో శివమ్ దూబే రెండు వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ఆరంభించింది. అయితే మూడో ఓవర్లో హార్దిక్ పాండ్య ఫకర్ జమాన్ (15) వికెట్ తీసి టీమిండియాకు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో సైమ్ అయూబ్ తో కలిసి సాహిబ్జాదా ఫర్హాన్ మెరుపులు మెరిపించాడు. దీంతో పాకిస్థాన్ పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత కూడా పాక్ ఆధిపత్యం చూపించింది. స్పిన్నర్లు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అలవోకగా పరుగులు రాబట్టారు. ప్రతి ఓవర్ లో ఒక సిక్సర్ కొడుతూ తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించింది.  

రెండో వికెట్ కు 72 పరుగులు జోడించిన తర్వాత ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దూబే విడగొట్టాడు. సైమ్ అయూబ్ (21) వికెట్ తీసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇండియా బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ పాకిస్థాన్ ను ఒత్తిడిలోకి నెట్టారు. వికెట్ నష్టానికి 93 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్.. 4 వికెట్ల నష్టానికి 115 పరుగులతో నిలిచింది. చివర్లో ఫహీన్ అష్రాఫ్ 8 బంతుల్లోనే 2 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 20 పరుగులు చేసి పాక్ స్కోర్ ను 170 పరుగులకు చేర్చాడు. తొలి 10 ఓవర్లలో 91 పరుగులు చేసిన పాకిస్థాన్.. తర్వాత 10 ఓవర్లలో 80 పరుగులు చేసింది.