China Masters 2025: చైనా మాస్టర్స్ ఫైనల్లో భారత జోడి ఓటమి.. టాప్-సీడ్‌ చేతిలో వరుస గేమ్‌లలో పరాజయం

China Masters 2025: చైనా మాస్టర్స్ ఫైనల్లో భారత జోడి ఓటమి.. టాప్-సీడ్‌ చేతిలో వరుస గేమ్‌లలో పరాజయం

చైనా మాస్టర్స్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ లకు నిరాశే మిగిలింది. ఆదివారం (సెప్టెంబర్ 21)  జరిగిన ఏకపక్ష పోరులో వరుసగా రెండు గేమ్ లలో ఓడిపోయారు. కేవలం 45 నిమిషాల్లో ముగిసిన ఈ తుది సమరంలో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ ప్రపంచ ఛాంపియన్లు, కొరియా టాప్-సీడ్‌ కిమ్ వోన్-హో, సియో సెయుంగ్-జే చేతిలో 21-19, 21-15 తేడాతో ఓడిపోయారు. హాంకాంగ్ ఓపెన్ తర్వాత సాత్విక్- చిరాగ్ జోడీ వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకున్నా రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

చైనాలోని షెన్‌జెన్ అరీనాలో జరిగిన ఈ మ్యాచ్‌ తొలి గేమ్ లో భారత జోడీ అద్భుతమైన పోరాటం చూపించారు. తొలి గేమ్ లో ఆధిపత్యం చూపిస్తూ 11-7తో లీడ్ లోకి వెళ్లారు. ఆ తర్వాత మరింత చెలరేగి ఆడి 14-7తో ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. ఇక తొలి గేమ్ సాత్విక్- చిరాగ్ జోడీదే అనుకున్న సమయంలో యా జంట చెలరేగి ఆడింది. వరుసగా పాయింట్లు కొడుతూ 21-19తో గేమ్ గెలుచుకుంది. రెండో గేమ్ లో కొరియా జోడీ ముందు భారత జోడీ నిలవలేకపోయింది. తొలి సెట్ ఇచ్చిన ఊపుతో 21-15 తేడాతో రెండో గేమ్ కూడా గెలిచి మ్యాచ్ తో పాటు టైటిల్ గెలుచుకున్నారు. 2023 చైనా ఓపెన్ లో రన్నరప్ గా నిలిచిన భారత జోడీ రెండేళ్ల తర్వాత కూడా టైటిల్ గెలవడంతో విఫలమైంది.

ఈ టోర్నీలో రన్నరప్ గా నిలిచిన సాత్విక్- చిరాగ్ జోడీ రూ.38.54 లక్షలు గెలుచుకున్నారు. విజేతగా నిలిచిన కిమ్ వోన్-హో, సియో సెయుంగ్-జే జోడీకి 81.48 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఈ ఈవెంట్ మొత్తం ప్రైజ్ మనీ రూ. 11.01 కోట్లు. మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన పీవీ సింధుకు రూ. 6.05 లక్షలు గెలుచుకుంది. పురుషుల సింగిల్స్‌లో మొదటి రౌండ్‌లో పరాజయాలను చవిచూసిన లక్ష్య సేన్, ఆయుష్ శెట్టిలకు రూ.1.10 లక్షలు దక్కాయి.