
హైదరాబాద్: బతుకమ్మ పండుగ వేళ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఫ్యామిలీపై కుట్రలు చేసినోళ్లను వదలిపెట్టనని.. భవిష్యత్‌లో వాళ్ల భరతం పడతానని హెచ్చరించారు. కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగిన ఎంగిల పూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు, మహిళలు.
చింతమడక గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నారామ్ ముత్యం ఇంట్లో తోటి మహిళలతో కలిసి పాటలు పాడుతూ కవిత బతుకమ్మను పేర్చారు. అనంతరం మహిళలు, గ్రామస్తులతో కలసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. చింతమడక ఇచ్చిన ధైర్యంతో తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా తిరిగానని గుర్తు చేసుకున్నారు.
కుటుంబానికి దూరమైన బాధలో ఉన్న నాకు చింతమడక అండగా నిలిచిందని కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రత్యేక పరిస్థితుల్లోనూ తనను ఆదరించారని చింతమడక గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ సిద్దిపేట రావాలంటే కేజీఎఫ్‌లోకి వెళ్లినట్లు ఆంక్షలు పెడుతున్నారని కానీ ఇక్కడ ఎవరి ఆంక్షలు పని చేయవని హాట్ కామెంట్ చేశారు.
కొంతమంది సిద్దిపేట, చింతమడకను సొంత ఆస్తిలా చూస్తున్నారు. కానీ ఏ ఊరు.. ఎవ్వరి జాగీరు కాదు. మళ్లీ మళ్లీ సిద్దిపేట, చింతమడకకు వస్తా. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువగా వస్తానని హెచ్చరించారు కవిత. నన్ను నా కుటుంబానికి దూరం చేశారు.. నా కుటుంబంపై కుట్రలు చేసిన వాళ్లను వదలిపెట్టనని అన్నారు. చంద్రుడి లాంటి కేసీఆర్‌కి కూడా మచ్చ తెచ్చారని ఫైర్ అయ్యారు. బతుకమ్మ పండగ వేళ కేసీఆర్ సొంతూర్లో కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును ఉద్దేశించే కవిత పరోక్షంగా విమర్శలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.