
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసా రుసుము పెంపుపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ హాట్ కామెంట్స్ చేశారు. భారత దేశ ప్రతిభను ప్రపంచం భయపడుతోందని పరోక్షంగా అమెరికాపై విమర్శలు గుప్పించారు. ఇండియా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు అర్ధం చేసుకుంటున్నాయని.. అందుకే అనేక దేశాలు మనతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. భారతదేశంతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఇండియా ప్రతిభ చూసి భయపడుతున్నారని.. అయినా కూడా మాకేమి అభ్యంతరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, హెచ్1బీ వీసా వార్షిక ఫీజును అమాంతం లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. అంటే.. అమెరికా కేంద్రంగా పని చేసే కంపెనీలు హెచ్1బీ వీసా కింద తాము రిక్రూట్ చేసుకునే విదేశీ ఉద్యోగుల కోసం ప్రభుత్వానికి లక్ష డాలర్లు చెల్లించాలి. హెచ్1బీ వీసా హోల్డర్లలో 70 శాతం భారతీయులే ఉన్నారు.
ఇందులో ఎక్కువగా ఐటీ రంగానికి చెందినవారే. ఫలితంగా హెచ్1బీ వీసా వార్షిక ఫీజు పెంపు ప్రభావం ఎక్కువగా ఇండియన్స్ మీదనే పడనుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఇండియా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఇండియాపై ట్రంప్ ఏకపక్షంగా 50 శాతం సుంకాలు విధించడంతో ఇరుదేశాల వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణిగి ఇరుదేశాలు మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మొదలయ్యాయి. సెప్టెంబర్లో అమెరికా బృందం ఇండియాకు వచ్చి వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. 2025, సెప్టెంబర్ 22న ఇండియా బృందం అమెరికా వెళ్లి ట్రేడ్ డీల్‌పై చర్చలు జరపనుంది.
ఈ తరుణంలో భారతీయ ఉద్యోగులకు ఇబ్బంది కలిగేలా హెచ్1బీ వీసా ఫీజును ట్రంప్ భారీగా పెంచడంతో ఇరుదేశాల మధ్య మళ్లీ కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే హెచ్1బీ వీసా వార్షిక ఫీజును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.