నడిగడ్డ జడ్పీ పీఠం అలంపూర్ వాసులకే!

నడిగడ్డ జడ్పీ పీఠం  అలంపూర్ వాసులకే!
  • గద్వాల నియోజకవర్గంలో ఒక్క జడ్పీటీసీ కూడా ఎస్సీకి రిజర్వ్  కాలే
  • రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు

గద్వాల, వెలుగు: గద్వాల జడ్పీ పీఠం అలంపూర్  వాసులకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో 33 జడ్పీ చైర్మన్  పోస్టులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 జడ్పీటీసీలు ఉండగా, జడ్పీ పీఠాన్ని ఎస్సీకి రిజర్వ్​ చేశారు. కాగా, జడ్పీటీసీ స్థానాలకు అధికారులు ఇటీవల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో 8 మండలాలు, గద్వాల నియోజకవర్గంలో 5 మండలాలకు జడ్పీటీసీల రిజర్వేషన్  కోసం లక్కీ డిప్  నిర్వహించారు. 

గద్వాలలోని ఐదు జడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా ఎస్సీకి రిజర్వ్​ కాకపోవడంతో ఈసారి అలంపూర్  నియోజకవర్గానికి చెందిన వారు జడ్పీ చైర్మన్​గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. అలంపూర్ లోని అలంపూర్(ఎస్సీ జనరల్), అయిజ(ఎస్సీ జనరల్), ఇటిక్యాల(ఎస్సీ మహిళ) ఖరారయ్యాయి ఈ 3 మండలాల్లో గెలిచిన వారిలో ఒకరు జడ్పీ చైర్మన్​ అవుతారని భావిస్తున్నారు. లేదంటే జనరల్​ స్థానంలో ఎస్సీ అభ్యర్థిని బరిలో నిలపాల్సి ఉంటుంది. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

జడ్పీటీసీ రిజర్వేషన్లు ఇలా..

అలంపూర్(ఎస్సీ జనరల్), ఉండవల్లి(జనరల్  మహిళ), మానవపాడు(బీసీ జనరల్), రాజోలి(బీసీ జనరల్), అయిజ(ఎస్సీ జనరల్), వడ్డేపల్లి(బీసీ మహిళ), ఇటిక్యాల(ఎస్సీ మహిళ), ఎర్రవల్లి(బీసీ జనరల్), గద్వాల(జనరల్), గట్టు(జనరల్  మహిళ), మల్దకల్(బీసీ మహిళ), ధరూర్(జనరల్  మహిళ), కేటిదొడ్డి(బీసీ మహిళ)కు రిజర్వ్​ చేశారు. ఎంపీపీ స్థానాల్లో అలంపూర్(ఎస్సీ జనరల్), ఉండవల్లి(జనరల్), మానవపాడు(బీసీ జనరల్), రాజోలి(బీసీ జనరల్), అయిజ(ఎస్సీ మహిళ), వడ్డేపల్లి(జనరల్), ఇటిక్యాల(ఎస్సీ జనరల్), ఎర్రవల్లి(బీసీ మహిళ), గద్వాల(జనరల్  మహిళ), గట్టు(జనరల్), మల్దకల్(బీసీ మహిళ), ధరూర్(జనరల్), కేటిదొడ్డి( బీసీ మహిళ)కు కేటాయించారు.

గద్వాల నేతల్లో అసంతృప్తి..

గద్వాల జడ్పీ స్థానం ఎస్సీకి రిజర్వేషన్  కావడం, గద్వాల నియోజకవర్గంలో ఒక్క జడ్పీటీసీ స్థానం కూడా ఎస్సీకి రిజర్వ్​ కాకపోవడంతో ఇక్కడి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలోనూ అలంపూర్ కు చెందిన సరిత జడ్పీ చైర్​పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈసారి కూడా అలంపూర్  నియోజకవర్గానికే జడ్పీ పీఠం దక్కనుండడంతో గద్వాల నేతల్లో అసంతృప్తి నెలకొంది.

రెండు విడతల్లో ఎన్నికలు..

జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతలో గద్వాల మండలంలోని 69 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 9న నామినేషన్స్, 12న స్క్రూటినీ, 15 విత్ డ్రా, 23న పోలింగ్  నిర్వహించనున్నారు. రెండో విడతలో అలంపూర్  నియోజకవర్గంలోని 8 మండలాల్లో జడ్పీటీసీ, 73 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 

13న నామినేషన్స్, 16న స్క్రూటినీ, 19న విత్ డ్రా,27న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్  నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనుండగా, గద్వాల జిల్లాలో రెండు, మూడో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 255 సర్పంచ్, 2,390 వార్డు మెంబర్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు.