
హైదరాబాద్, వెలుగు: ‘‘రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టిచ్చాం అంటూ హరీశ్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. బంగారు పళ్లెం కాదు.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు..’’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మండిపడ్డారు. రూ.7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని అసెంబ్లీ సెషన్లోనే బట్టబయలు చేశామని ఆయన చెప్పారు. ఇన్ని అప్పులు ఉన్నా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణతో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో అదానీని కలిసినా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడులు, పరిశ్రమల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం అదానీని కలిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. అసలు కేటీఆర్‌కు కామన్ సెన్స్ ఉందా? అని నిలదీశారు. ఎన్నికల్లో ఓడిపోయినా బావబామ్మర్దులకు ఇంకా జ్ఞానోదయం కలగడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో మోసం చేశారు కాబట్టే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తం
ఆరు గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని జూపల్లి స్పష్టం చేశారు. ప్రజాపాలన అప్లికేషన్ల డిజిటలైజేషన్పూర్తికాగానే గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. రెండు గ్యారంటీలు అమలు చేస్తేనే బీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు. మిగతా గ్యారంటీలనూ అమలు చేస్తే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. అందుకే దాని నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ పార్టే గల్లంతవుతుందంటూ కేటీఆర్, హరీశ్ రావు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమని, ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ మిగలరన్నారు. అందుకే కార్యకర్తలను కాపాడుకునేందుకు కేటీఆర్, హరీశ్ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీతోనూ తెరచాటు ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసినా ప్రజలు నమ్మరన్నారు.
ఇంగ్లిష్ మాట్లాడడానికి తప్ప కేటీఆర్దేనికీ పనికిరాడు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
కేటీఆర్ ఇంగ్లిష్ మాట్లాడడానికి తప్ప దేనికీ పనికిరారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అంత ఇంగ్లిష్ వచ్చి ఆయన తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లిష్ రాదని ట్రోల్చేస్తున్నారని, కానీ.. బీఆర్ఎస్ హయాంలో మూడేండ్లలో రాని పెట్టుబడులను నెల రోజుల్లోనే సీఎం రేవంత్ సాధించారని తెలిపారు. రేవంత్ రెడ్డి దావోస్ టూర్లో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తేవడంతో బీఆర్ఎస్ నేతలు షాక్ అవుతున్నారన్నారు. కేటీఆర్ తన దోస్తుల దొంగ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం వల్లే అనేక ఇబ్బందులు వచ్చాయన్నారు. సోషల్ మీడియా వారియర్స్‌గా చెప్పుకుంటున్న దొంగ వారియర్స్ నిజాలు మాట్లాడాలని శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.