కేసీఆర్ పై సభా ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలి

కేసీఆర్ పై సభా ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలి

 

  • దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై సభా ఉల్లంఘన కింద నోటీసు ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వి ఉత్తరకుమార మాటలని, అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పిండని విమర్శించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని టీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పలేదని నిండు సభలో అబద్దాలు చెప్పిన సీఎం కేసీఆర్ పై సభా ఉల్లంఘన కింద నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చెప్తున్న అబద్దాలపై న్యాయ పరంగా కూడా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో భగవత్గీత బైబుల్, ఖురాన్ అని చెప్పిన కేసీఆర్ ఎలా అబద్దాలు ఆడుతున్నాడో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 
ఇదే మ్యానిఫెస్టో పైన ప్రమాణం చేసి చెప్తావా కేసీఆర్..? 
ఇదే మ్యానిఫెస్టో పైన ప్రమాణం చేసి చెప్తావా కేసీఆర్..? అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పలేదని, కోనేరు రంగారావు సిఫారసులను గిర్ గ్లాని కమిటీ సిఫారసులను ఎందుకు అసెంబ్లీలో చర్చకు పెట్టడం లేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేయించిన కేసీఆర్...ఆ సర్వే వివరాలను ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని నిలదీశారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ప్రజల ముందు పెట్టడు గానీ కులాల లెక్కలు చేయాలని  కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాడని విమర్శించారు. కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిండు అని గుర్తు చేస్తూ.. కుల గణన అంశం కోర్టులో ఉంది..కోర్టులో ఉన్న విషయం పై కేసీఆర్ అసెంబ్లీ తీర్మానం ఎలా చేస్తాడు? అని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధాన మంత్రి మోడీని కలుద్దాం అని కేసీఆర్ దళిత నేతలతో అన్నాడు అని గుర్తు చేస్తూ.. ఏండ్లు అవుతుంది హామీ ఇచ్చింది  ...ఇంత వరకు మోడి వద్దకు తీసుకెళ్లలేదని విమర్శించారు. 
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..
కేసీఆర్ అన్నీ అబద్దాలే మాట్లాతున్నాడని ఎమ్మెల్యే రఘునందన్ రావు దుయ్యబట్టారు. స్థానిక సంస్థల్లో  కేంద్రం నిధులు లేవని కూడా అబద్ధాలే చెప్తున్నాడన్నారు. అన్ని నిధులు కేంద్రానివేనని తెల్సు... కానీ హుజూరాబాద్ ఎన్నికల కోసం అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జ్ఞాపక శక్తి తగ్గింది అనిపిస్తోంది, హుజూరాబాద్ ఎన్నికల కోసం  అసెంబ్లీ టైమ్నీ వేస్ట్ చేసిండు కేసీఆర్, కేసీఆర్ నాకు గురువు అని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. రేవంత్ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నడు, బట్ట కాల్చి మీద వేయడం కరెక్ట్ కాదు, రేవంత్ రెడ్డికి వెనుక ఉన్నట్టు నాకు మాజీ సీఎంలు లేరు...పెయిడ్ మీటింగులు ఏర్పాటు చేసే వాళ్లు అంతకన్నా లేరని ఆయన వివరించారు.