- ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
ఆసిఫాబాద్, వెలుగు: విద్యుత్ వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ఎన్ పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో విద్యుత్ శాఖ సీఈ(ఆపరేషన్ 1) అశోక్‌తో కలిసి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎలాంటి అంతరాయం లేని వినియోగదారులకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
జిల్లాలోని వినియోగదారులకు మెరుగైన సేవలం దించేందుకు జిల్లాలోని లింగాపూర్ మండల కేంద్రంలో రూ.3.99 కోట్లతో, కెరిమెరి మండలం ధనోరాలో రూ.2.30 కోట్లతో, ఆసిఫాబాద్ మండలం వావుడంలో రూ.2.64 కోట్లు, చింతల మానేపల్లి మండలం గూడెంలో రూ.2.32 కోట్లతో 33/11 సబ్స్టేషన్లు, జిల్లా కేంద్రంలో రూ.1 కోటితో విద్యుత్ సబ్ స్టార్, రూ.1.70 కోట్లతో సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో వంగిన, విరిగిన విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగలు, జనసంచార ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యుత్ ప్రమాదాల నివారణ దిశగా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
