Jr NTR : ఎన్టీఆర్ 'డ్రాగన్' లోకి బాలీవుడ్ నటుడు ఎంట్రీ.. బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే!

Jr NTR : ఎన్టీఆర్ 'డ్రాగన్' లోకి బాలీవుడ్ నటుడు ఎంట్రీ..  బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నిల్ కాంబినేషన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్".  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరాయి.   జూన్ 25, 2026న ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్టేట్ సోషల్ హల్ చల్ చేస్తోంది.

 ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్‌ కీలక పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలు నిజమైతే..  దాదాపు 46 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ తెలుగు చిత్రసీమలోకి తిరిగి అడుగుపెట్టినట్టే.   బాలీవుడ్‌లో అగ్ర నటుడిగా ఎదగకముందు ఆయన దర్శకుడు బాపుతో కలిసి 1980లో వచ్చిన వంశ వృక్షం చిత్రంలో నటించారు. ఇప్పుడు ఇంత సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన తెలుగు సినిమాలోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. ఇటీవల యానిమల్, ఫైటర్, సావి, వార్ 2 వంటి చిత్రాలతో అనిల్ కపూర్ తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ముఖ్యంగా 'యానిమల్'లో ఆయన పోషించిన పాత్రకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి అనిల్ కుమార్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇస్తే అంచనాలు మరింత పెరగడం ఖాయం అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

ప్రస్తుతం 'డ్రాగన్ ' మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే కర్ణాటకలోని కుమ్టాలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించనుంది. దీని కోసం భారీ  సెట్ లను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కథాంశం కోల్ కతా బ్యాక్ డ్రాప్ , పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.  అణగారిన వర్గాల కోసం పోరాడే ఒక నాయకుడి కథతో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ యోర్నేని, హరికృష్ణ కొసరాజు, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం రవి బస్రూర్, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ్ అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.