అడ్డు తగులుతున్న అటవీచట్టాలు

అడ్డు తగులుతున్న అటవీచట్టాలు
  • హైటెక్ యుగంలోనూ అంధకారంలోనే గ్రామాలు
  • కాగితాలకే పరిమితమవుతున్న ప్రపోజల్స్

నిర్మల్, వెలుగు:  దేశమంతా స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఇలాంటి పరిస్థితుల్లోనూ నిర్మల్ జిల్లాలోని అనేక ఆదివాసీ గ్రామాలు నేటికీ కరెంట్ సౌకర్యానికి నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాలకు త్రీఫేస్ కరెంట్ లేకపోవడంతో సాగు కోసం తిప్పలు పడుతున్నారు. కరెంట్ లేక కేవలం వర్షాధారంపైనే పంటలే సాగు చేసుకుంటూ జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఎన్నికల సమయంలో పొలిటికల్ లీడర్లు కరెంటు సౌకర్యం కల్పిస్తామంటూ ఇస్తున్న హామీలు అమలుకునోచుకోవడం లేదు. ఆఫీసర్లు కరెంట్ తేవడానికి రూపొందిస్తున్న ప్రపోజల్స్ కు అటు సర్కారు నుంచి, ఇటు అటవీశాఖ నుంచి ఆమోద ముద్ర పడడం లేదు.

ఆ గ్రామాలివే..

నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చాకిరేవు, పోచంపల్లిగూడ, పెద్దరాగిదుబ్బ గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతున్నాయి. మరో 17 గ్రామాలకు త్రీఫేస్ కరెంట్ లేదు. సింగిల్ ఫేజ్ మాత్రమే ఉంది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక కడెం మండలంలోని రాంపూర్, మిడ్డిచింత, ధర్మాజీపేట గ్రామాలు కూడా ఇప్పటివరకు కరెంట్ వెలుగులకు నోచుకోలేదు. ఈ మండలంలోని మరో 14 గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రావడం లేదు. అలాగే మామడ మండలంలోని బుర్కలేగిగూడ గ్రామానిదీ ఇదే పరిస్థితి. ఈ మూడు మండలాల్లో కలిపి సుమారు 3వేల మంది తమ ఊళ్లకు కరెంట్​ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

అడ్డుతగులుతున్న అటవీ చట్టాలు..

పెంబి, కడెం, మామడ మండలాలకు చెందిన మారుమూల గ్రామాలు కవ్వాల్ టైగర్ జోన్​పరిధిలోని వస్తాయి. ఆయా గ్రామాల్లో ‘అభయారణ్య చట్టం’ కరెంట్ సరఫరాకు అడ్డంకిగా మారింది.  పవర్ లేక ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఆఫీసర్లు ప్రపోజల్స్ పంపుతున్నా.. అటు ప్రభుత్వం నుంచి ఇటు అటవీశాఖ నుంచి సరైన స్పందన రావడం లేదు. కొత్తగా విద్యుత్ లైన్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలంటే అటవీ శాఖ పర్మిషన్​తప్పనిసరి. కానీ వివిధ కారణాలు సాకుగా చూపి, పర్మిషన్ జారీ చేయడం లేదు. కరెంట్ తీగల వల్ల వన్య ప్రాణులకు ప్రమాదం ఏర్పడవచ్చనే కారణంగా అనుమతులు ఇవ్వడం లేదు. ఫలితంగా ఆదివాసీ గ్రామాల ప్రజలు చీకటిలోనే మగ్గుతున్నారు. ఇటీవల అటవీ, విద్యుత్ శాఖలు కలిసి డీజీపీఎస్​ సర్వే నిర్వహించి, కరెంట్ వైర్లకు బదులుగా ఇన్సెలేటెడ్ వైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. మొత్తం 77.85 కిలోమీటర్ల మేర సరఫరా అవసరమని గుర్తించాయి. కానీ వీటికి కూడా అటవీశాఖ ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్లు రావడం లేదు.

తప్పని తిప్పలు..

కరెంట్ కోసం ఆదివాసీలు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నా.. వారి గోడు అరణ్య రోదనే అవుతున్నది. దీంతో దీపాల వెలుగులోనే జీవనం గడుపుతున్నారు. బావి మోటార్లు, మొబైల్​ఫోన్లు, ఆన్ లైన్ సేవలు అక్కడ అందుబాటులో లేవు. చార్జబుల్, కరెంట్ మెషిన్లతో ముడిపడి ఉన్న వివిధ రకాల పథకాలు కూడా అమలు కావడం లేదు. ఎమర్జెన్సీ సమయంలో కరెంట్ ఉన్న ఊర్లకు వచ్చి, వారి పనులు చేసుకుంటున్నారు. ఇక పిల్లల చదువులు పగటి పూట మాత్రమే సాగుతున్నాయి. రాత్రి వేళ చదవాలంటే కాగడాలే దిక్కవుతున్నాయి. ఆయా గ్రామాల్లోకి వెళితే పాత రోజులు గుర్తుకొచ్చే పరిస్థితి ఉన్నది.

ప్రపోజల్స్ రెడీ చేశాం..

పెంబి, కడెం, మామడ మండలాల్లోని ఆరు గ్రామాలకు పూర్తి స్థాయిలో, మరో 38 గ్రామాలకు త్రీఫేజ్​సౌకర్యం కల్పించేందుకు గతంలోనే ప్రపోజల్ రెడీ చేసి, అటవీ శాఖకు పంపాం. టెక్నికల్​సమ స్యల కారణంగా ఆ శాఖ అను మతులు జారీ చేయలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రపోజల్ కూడా రెడీ చేశాం. పర్మిషన్ వస్తే.. పనులు చేపడుతాం.- జైవంత్ చౌహాన్, ఎస్ఈ, నిర్మల్​