కోటగిరి, వెలుగు: కొడిచర్ల శివారులోని రైతుల పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను మంగళవారం మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సోమవారం పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్లను స్థానికులు ఆపగా, కొందరిపై కేసులు నమోదు చేశారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. అనుమతి లభించిన చోట ఇసుక లేకపోవడం వల్ల వేరే ప్రాంతం నుంచి ఇసుక తెచ్చి డంప్ చేసి, టిప్పర్లలో అధిక లోడ్ పెట్టి రవాణా చేస్తున్నారు.
దర్యాప్తుకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడేందుకు ఒప్పుకోకపోవడంతో, స్థానిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు, ఇసుక తరలిస్తున్న టిప్పర్లకు పూర్తిగా అనుమతులు ఉన్నాయని తెలిపారు. మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ నగేశ్, బోధన్ డిప్టీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే దత్తు, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ గంగాధర్, పోతంగల్ సర్వేయర్ పోశెట్టి, కోటగిరి ఎస్సై సునీల్, పొలం పట్టాదారులు నగేశ్పటేల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
