
- ఆయిల్ మిషన్ పథకంతో రాష్ట్రంలో పెరుగుతున్న ఆయిల్ పామ్ సాగు
- నాలుగేండ్లలో 1.97 లక్షల ఎకరాల్లో పంట
- ఈ ఏడాది మరో లక్షన్నర ఎకరాలకు పైగా లక్ష్యం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగేండ్ల క్రితం సాగు చేసిన ఆయిల్పామ్పంట చేతికి వస్తుండడం.. మరో వైపు గెలల ధర భారీగా పెరగడంతో రైతుల్లో నూతన ఉత్సాహం నెలకొంటోంది. ఇన్నాళ్లు ఎప్పుడో వచ్చే పంట కోసం ఇప్పుడేం కష్టపడి సాగు చేయాలనుకున్న రైతులు కూడా..ఇప్పుడు ఆయిల్‌పామ్‌సాగుకు మొగ్గు చూపుతున్నరు. దీంతో రాష్ట్రంలో ఆయిల్పామ్సాగు పెరుగుతున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.43లక్షల ఎకరాల్లో ఆయిల్ఫామ్సాగులో ఉంది.
ఆయిల్పామ్పథకంలో పెట్టిన టార్గెట్‌లో ఇప్పటి వరకు 1లక్షా 97వేల 172 ఎకరాల్లో సాగు జరిగింది. తాజాగా పంట చేతికి వస్తుండడంతో పంటను చూసిన ఇతర రైతులు ఆయిల్‌పామ్‌సాగుకు ఆకర్షితులవుతున్నరు. రాష్ట్రంలో 12,437 మంది రైతులకు సంబంధించి.. 56949.58 ఎకరాల్లో నాలుగేండ్ల క్రితం సాగైన పంట ఇప్పుడు చేతికి వస్తోంది. మిగతా 52,212 మంది రైతులు సాగు చేస్తున్న 1,86,548 ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్‌పామ్ సాగులో ఇంకా పంట చేతికి రావాల్సి ఉంది.
ఏటా పెరుగుతున్న సాగు
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. దిగుబడి వచ్చేంత వరకు అంతర పంటల సాగుతో అదనపు ఆదాయం పొందవచ్చు. వరి, పత్తి పంటలతో పోల్చితే రైతులు తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో మంచి లాభాలు సాధించే అవకాశం ఉంది. దీంతో గత నాలుగేండ్లుగా రాష్ట్రంలో ఆయిల్పామ్గణనీయంగా పెరుగుతోంది. పామ్ మిషన్ ప్రారంభించిన మొదటి ఏడాది 15,295 ఎకరాల్లో సాగు చేయగా 2021=22 నాటికి ఇచ్చిన టార్గెట్ కంటే 150శాతం అధికంగా సాగు చేశారు. దీంతో ఆ ఒక్క ఏడాదే 82,370 ఎకరాల్లో సాగు జరిగింది. మూడో ఏడాదిలో 59,260 ఎకరాల్లో సాగు చేయగా.. గత 2024=25 ఆర్థిక సంవత్సరంలో 40,247 ఎకరాల్లో ఆయిల్ పామ్‌సాగు జరిగింది. ఇలా నాలుగేండ్లలోనే 1,97,172 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగైనట్లు హార్టీకల్చర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక్కసారి నాటితే 30 ఏండ్ల దాకా దిగుబడి
ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. నాటిన నాలుగో యేడు నుంచి పంట చేతికి వస్తుంది. మొదటి నాలుగేండ్ల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తున్నది. మొదటి మూడేండ్లు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ లాంటి పంటలను అంతర పంటగా సాగు వేసుకోవచ్చు. నాలుగో యేడు నుంచి పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం 10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి వస్తుంది. చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇటీవల గద్వాల జిల్లాలో మొదటి కాతలోనే 30టన్నుల దిగుబడి రావడం గమనార్హం.
ఆయిల్‌పామ్ సాగుపై రైతుల్లో ఆసక్తి
గతంలో వేసిన ఆయిల్పామ్పంట నేడు చేతికి వస్తుండడం.. మరో వైపు గెలల భారీగా ధర పలుకుతుండడంతో రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు వస్తున్నరు. రైతుల అనుమానాలు నివృత్తి అవుతుండడంతో సాగుకు ఉత్సాహం చూపిస్తున్నరు. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది. పండించిన గెలలు రవాణాకు సైతం సహకరిస్తోంది.- యాస్మిన్ భాషా, డైరెక్టర్, హార్టీకల్చర్, ఎండీ, ఆయిల్ ఫెడ్
ఆయిల్ పామ్‌కు ప్రోత్సాహం..
వరి, ఇతర సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నూనె వినియోగానికి తగినట్టు పంట లేకపోవడంతో ఏటా దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఫలితంగా ఆదాయం కోల్పోవడంతో పాటు అధిక ధరలకు నూనెలను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీనిని నివారించేందుకు ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నది. రాష్ట్రంలో గత 2020–21 నుంచి ఆయిల్‌పామ్ మిషన్ కొనసాగుతోంది. రైతులకు రాయితీలు ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారు.
ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మొదటి నాలుగేండ్లలో అంతర పంటల సాగుకు, కలుపు తీయడానికి, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి రూ.4,200 ఆర్థిక సాయం అందిస్తోంది. మార్కెట్ లో రూ.193 నుంచి రూ.200 ఉండే ఆయిల్‌పామ్ మొక్కలను సబ్సిడీతో రూ.20కే రైతులకు అందిస్తోంది. డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు యూనిట్ ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోంది.