శిల్పకళా వైభవానికి తెలంగాణ పెట్టింది పేరు. నిజాం రాజుల అద్భుత నిర్మాణాలు... కాకతీయుల కాలం నాటి ఆలయాలు ఇప్పటికీ చాలాచోట్ల కనిపిస్తుంటాయి. ఇలాంటిదే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నరసింహులపల్లిలో కొలువైన మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయంలోని పానవట్టంపై మీటితే సప్తస్వరాలు వినిపించడం విశేషం... కార్తీకమాసం సందర్భంగా సంగీతం వినిపించే మల్లన్న గురించి తెలుసుకుందాం. . .!
కరీంనగర్ జిల్లా నరసింహులపల్లి గ్రామానికి కోట్ల పేరు కూడా ఉంది. పూర్వం ఈ గ్రామం చుట్టూ మట్టితో నిర్మించిన కోట లాంటి నిర్మాణం ఉండేది. దీనికి తూర్పు, పడమర వైపున పెద్ద పెద్ద ద్వారాలు ఉండేవి. ఆ ద్వారాల నుంచే గ్రామస్తులు రాకపోకలు సాగించే వాళ్లు ఆ తర్వాత ద్వారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వీటికి తోడు గ్రామంలో ఉన్న66 ఆలయాలు, 66 కుంటలు కూడా చాలా వరకు ధ్వంస మయ్యాయి. ప్రస్తుతం సోమనాథ ఆలయం రామాలయం, లక్ష్మీనృసింహాలయం గుట్టపై కోనేరు మాత్రమే ఉన్నాయి.
ఎరుపు రంగు గ్రానైట్ తో నిర్మాణం
మల్లికార్జునస్వామి ఆలయం ఎరుపు రంగు గ్రానైట్ తో నిర్మించారు. ఈ ఆలయంలో చోళుల శిల్పకళ స్పష్టంగా కనిపిస్తుంది. కిటికీలు సైతం గ్రానైట్ తో నిర్మించడం ఇక్కడ విశేషం. ప్రస్తుతం
వీటిని దాతల సాయంతో ఆధునీకరించారు.
గర్భగుడిలో ఎత్తైన శివలింగం ఏర్పాటు చేశారు. విశాలమైన పానపట్టం కూడా ఉంది. ఈ పానవ ట్టంపై నాణెంతో మీటితే సంగీతం వినిపిస్తుంది. ఈ విషయం ఆ ఊరి వాళ్లకు తప్ప బయటివాళ్లకు తెలియదు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి విశేషాలు చెబుతుండటంతో ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంతో భక్తుల రాక కూడా పెరిగింది.
చోళుల కాలంనాటి ఆలయం
ఈ గ్రామం నుంచి నందగిరికి వెళ్లే దారిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే రాజరాజేశ్వరి, మల్లికార్జున స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ ఆలయాల్ని మెరుగుపరిచేందుకు గతంలో ఆలయ పూజారి ముందుకొచ్చారు. దాతల సహాయంతో ఆలయాల రూపు రేఖల్ని అందంగా మార్చివేశారు.
కోరికలు తీర్చే వీరభద్రుడు
భక్తుల కొంగు బంగారంగా మారిన ఈ గుడిలో వీరభద్రుడికి మొక్కుకుంటే తప్పకుండా కోరిక తీరుతుందనే విశ్వాసం భక్తుల్లో ఉంది. ఆ సమ్మకంతోనే ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ ఆలయ అభివృద్ధికి చేయూత నిస్తున్నారు.
ఆలయంలో వీరభద్రుని పాదాల చెంత, కాలం సమయంతో పని లేకుండా ఎప్పుడూ నీటి ఊట రావడం ఈ దేవాలయంలో ఎంతో విశేషంగా ఉంది.
అన్నదానం చేసేది ఒకరే..
నరసింహులపల్లి గ్రామంలో స్థానికంగా ఉన్న ఇతర ఆలయాలు కూడా అభివృద్దికి నోచుకోలే దు. గ్రామస్తులు, దాతల సాయంతోనే మల్టీకా ర్జున స్వామి ఆలయం అభివృద్ధి చెందింది. ఏటా సంక్రాంతికి మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం ఒకేభక్తుడు అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నాడు.
ఎలా వెళ్లాలంటే...
కరీంనగర్ నుంచి నేరుగా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా లేదు. తీర్మాల పూర్ గ్రామం నుంచి కిలోమీటర్ పైగా మట్టి రోడ్డుపై వెళ్లాలి. మరో మార్గం నందగిరి నుంచి ఉంది. ఇది కూడా రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డు. ప్రభుత్వం బీటీ రోడ్డుతో పాటు ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే తమ గ్రామం పర్యా టక కేంద్రంగా మారుతుందని నరసిం హులపల్లి గ్రామస్తులు చెబుతున్నారు.
–వెలుగు,లైఫ్–
