Shubman Gill: 200 పరుగులు కూడా చేయలేదు.. గిల్‌పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ విమర్శలు

Shubman Gill: 200 పరుగులు కూడా చేయలేదు.. గిల్‌పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ విమర్శలు

టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. టెస్టుల్లో స్థాయికి తగ్గటు ఆడుతున్న గిల్ పరిమిత ఓవర్ల క్రికెట్ లో విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సెంచరీ కొట్టిన గిల్.. ఆ తర్వాత  ఒక్క మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేదు. శుభమాన్ ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమవుతున్నాడు. వన్డే సిరీస్ లో ఘోరంగా విఫలం కాగా.. టీ20 ఫార్మాట్ లోనూ బ్యాట్ కు ఇంకా పని చెప్పలేదు. దీంతో గిల్ పై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు కురిపించాడు. 

ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.." గిల్ చివరి 10 టీ20 ఇన్నింగ్స్ లు చూసుకుంటే అతను మొత్తం 200 పరుగులు కూడా చేయలేదు. ఈ సమయంలో సహజంగానే అతడిపై ఒత్తిడి ఉంటుంది. గిల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. అతనికి సపోర్ట్ లభిస్తుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. అతని దగ్గర ఎక్కువ సమయం లేదు. ఐపీఎల్‌లో మనం చూసిన అత్యుత్తమ టీ20 ఆటగాడు యశస్వి జైస్వాల్ 160 స్ట్రైక్ రేట్ తో బెంచ్‌పై వేచి ఉన్నాడు. శుభ్‌మాన్ గిల్‌కు రెగ్యులర్ అవకాశాలు వస్తుండడంతో అతడు బెంచ్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది. జైశ్వాల్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. అతను అద్భుతాలు చేయగలడు". అని ఈ మాజీ ఆల్ రౌండర్ గిల్ కు వార్నింగ్ ఇచ్చాడు. 

ఆసియా కప్ లో అనూహ్యంగా గిల్ ను తీసుకొచ్చారు. ఏడాదిపాటు టీ20 ఫార్మాట్ ఆడకపోయినా వైస్ కెప్టెన్సీ అప్పగించి ప్లేయింగ్ 11 లో చోటు ఇచ్చారు. ఆసియా కప్ లో విఫలమైన ఈ టీమిండియా యువ బ్యాటర్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లోనూ పెద్దగా రాణించడం లేదు. సూపర్ ఫామ్ లో జైశ్వాల్ మూడు ఫార్మాట్ లు ఆడడానికి అర్హుడు. అయితే అతనికి కేవలం టెస్టుల్లో మాత్రమే చోటు దక్కుతుంది. ముఖ్యంగా గిల్ ను టీ20లోకి తీసుకొచ్చి జైశ్వాల్ కు అన్యాయం చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్లాట్ ట్రాక్ మీద మాత్రమే గిల్ ఆడతాడనే పేరుంది. ఈ విమర్శలు అన్ని ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్, టీ20 మ్యాచ్ ల్లో విఫలమైన తర్వాత వస్తున్నాయి. 

►ALSO READ | Women's ODI World Cup 2025: మెన్స్‌ను మించిపోయారు: వరల్డ్ కప్ విజేత, రన్నరప్‌లకు ప్రైజ్ మనీ ఎంతంటే..?

మూడో టీ20లో గిల్ ఆడకపోతే మాత్రం అతను మరినిపై ఒత్తిడి పెరగడం ఖాయం. ఇలాంటి కఠిన సవాలును గిల్ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 ఆదివారం (నవంబర్ 2) జరుగుతుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందే.