
- కనుమరుగవుతున్న సన్ఫ్లవర్, నువ్వులు, ఆముదం
- ఈ పంటలన్నీ కలిపినా 12 వేల ఎకరాల లోపే సాగు
- కంది మినహా పప్పుదినుసులదీ అదే పరిస్థితి
- పడిపోయిన పెసర, మినుములు, ఉలవల సాగు
- అగ్రికల్చర్ రిపోర్టులో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నూనెగింజల సాగు భారీగా పడిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్ లో వివిధ పంటలన్నీ 1.34 కోట్ల ఎకరాల్లో సాగు చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరిగింది. ఈ సీజన్ పంటల సాగులో పల్లీ, నువ్వులు, సన్ఫ్లవర్, ఆముదం తదితర ఆయిల్ సీడ్స్ అత్యల్పంగా సాగైనట్లు వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది. అంతేకాదు కంది మినహా మిగతా పప్పుదినుసులన్నీ తక్కువే సాగైనట్లు అగ్రికల్చర్ నివేదికలో స్పష్టమైంది. సాగైన పెసర్లు సైతం ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా దెబ్బతిన్నాయి. మినుములు, ఉలవలు వంటి పప్పుదినుసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అగ్రికల్చర్ క్రాప్షోయింగ్ ఏరియా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరి, పత్తి, మక్క వంటి పంటలకే పరిమితమవుతూ మిగతా పంటలను రైతులు పట్టించుకోవడం లేదని, ఇది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అగ్రికల్చర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో సాగైన నూనెగింజల పంటల్లో పల్లీ (వేరుసెనగ) 9,923 ఎకరాల్లో మాత్రమే నమోదైంది. నువ్వులు 47 ఎకరాలు , పొద్దుతిరుగుడు 5 ఎకరాలు, ఆముదాలు 1,125 ఎకరాలు, ఇతర ఆయిల్ సీడ్స్ 118 ఎకరాల్లో సాగయ్యాయి. ఇవన్నీ కలిపితే 11,218 ఎకరాలు మాత్రమే. అంటే రాష్ట్రంలో సాగైన 1.30 కోట్ల ఎకరాల్లో 0.086 శాతం. దీంతో నూనెగింజల పంటలన్నీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
4.90 లక్షల ఎకరాల్లో కంది..
రాష్ట్రంలో కంది పంట కొంత మొస్తరుగా సాగువుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4.90 లక్షల ఎకరాల్లో కంది సాగు జరిగింది. ఈ వానాకాలంలో కందులు మినహా పప్పులన్నీ తక్కువే సాగయ్యాయి. పెసర్లు 61,361 ఎకరాలు, మినుములు 24,482 ఎకరాల్లో సాగయ్యాయి. ఉలవలు 823 ఎకరాలు, అనుములు ఇతర పప్పు దినుసులు 708 ఎకరాల్లో సాగయ్యాయి. పెసర్లు, మినుములు, ఉలవులు, అనుములు ఇలా అన్ని కలిపినా 87,374 ఎకరాలు. కంది మినహా మిగతా ఏ పప్పుదినుసులైనా లక్ష ఎకరాలకు చేరలేదు.
మిగతా అంతా వరి, పత్తి, మక్కలే..
ఇప్పటివరకూ సాగైన పంటల్లో 65.52 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. వానాకాలం పంటల్లో వరియే టాప్ లో నిలిచింది. పత్తి 45.76 లక్షల ఎకరాల్లో సాగు కాగా, మక్కలు ఈయేడు అత్యధికంగా 6.36 లక్షల ఎకరాల్లో సాగై గత రికార్డులను తిరగరాసింది. తరువాత 4.90 లక్షల ఎకరాల్లో కంది, 3.62 లక్షల ఎకరాల్లో సోయా సాగు జరిగి వానాకాలం సీజన్ పంటల్లో టాప్5గా నిలిచాయి.
నల్గొండలో 11 లక్షలు, సంగారెడ్డి జిల్లాలో 7.29 లక్షలు, ఖమ్మంలో 6.29 లక్షల ఎకరాలు, ఆదిలాబాద్ జిల్లాలో 5.79 లక్షల ఎకరాలు, సూర్యాపేటలో 5.55 లక్షల ఎకరాలు, నిజామాబాద్లో 5.52 లక్షల ఎకరాలు, వికారాబాద్లో 5.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగైయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 20,834 ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది.