- గతంలో 16 మున్సిపాలిటీల్లో గెలువగా.. ప్రస్తుతం ఐదుకే పరిమితం
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన మాజీమంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించే జిల్లాలో పార్టీ ప్రాభవం మసకబారుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించిన బీఆర్ఎస్కు.. గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు షాక్ ఇచ్చాయి.
శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఫలితాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. హరీశ్‌రావు స్పెషల్ ఫోకస్ పెట్టి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అలుపెరగకుండా ప్రచారం నిర్వహించినప్పటికీ ఆశించిన ఫలితాలు దక్కలేదు.
16 నుంచి ఐదుకు పడిన బీఆర్ఎస్
2020లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 16 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం ఐదింటికే పరిమితం అయింది. గతంలో ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు ఏడింటిలో జెండా ఎగురవేసింది. మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో గతంలో స్పష్టమైన మెజార్టీ సాధించిన బీఆర్ఎస్కు ఇప్పుడు ఒక్క తూప్రాన్‌లో మెజార్టీ వచ్చింది. రామాయంపేటలో మూడు స్థానాలకే పరిమితం కాగా, నర్సాపూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా మేజిక్ ఫిగర్ దక్కలేదు. మెదక్‌లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు.
ఇక సిద్దిపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా దుబ్బాక, చేర్యాల, గజ్వేల్‌లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు దక్కించుకొని పట్టు నిలుపుకుంది. ఒక్క హుస్నాబాద్ మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పాగా వేసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకోగా ఇప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
ఈ జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా, ఐదు చోట్ల కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీఆర్ఎస్ మాత్రం ఒక్క గుమ్మడిదలలోనే మెజార్టీ సాధించగా మిగతా చోట్ల డబుల్ డిజిట్ దాటలేకపోయింది.
