
- వంద రోజుల కార్యక్రమంలో నమోదు చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖ చేపట్టిన వంద రోజుల కార్యక్రమంలో లక్ష నల్లా కనెక్షన్లను మున్సిపల్ కమిషనర్లు ఆన్లైన్ చేశారు. దీంతో నెలకు రూ.7 కోట్ల అదనపు ఆదాయం రానుందని చెబుతున్నారు. తాగునీటి నల్లా కనెక్షన్ల ద్వారా రావాల్సిన ఆదాయం రావడంలేదని గుర్తించిన అధికారులు దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్ని కలెక్షన్లను ఆన్లైన్ చేయడంతోపాటు డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్లకు వేర్వేరుగా ఫీజుల వసూలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో జీహెచ్ఎంసీని మినహాయిస్తే 15 మున్సిపల్ కార్పొరేషన్లు, 144 మున్సిపాలిటీలు, 159 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తొమ్మిది లక్షల కనెక్షన్లను మాత్రమే ఆన్ లైన్ లో నమోదై ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల రూ.59 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. గత నెల 2నుంచి మున్సిపల్ శాఖ ప్రారంభించిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మరో లక్ష నల్లా కనెక్షన్లు ఆన్ లైన్ చేశారు. దీంతో మున్సిపల్‌శాఖకు రూ.7 కోట్ల అదనపు ఆదాయం రానుందని అధికారులు చెబుతున్నారు.
వచ్చే మార్చి చివరి నాటికి మిగిలిన ఆరు లక్షల కనెక్షన్లను కూడా ఆన్ లైన్ లో ఎంట్రీ చేయాలని మున్సిపల్ శాఖ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కమిషనర్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కేటగిరీలను అనుసరించి నల్లా కనెక్షన్లకు రూ.100, రూ.70, రూ.50, రూ.30 చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నారు. కనెక్షన్లు ఆన్ లైన్ లో ఎంట్రీ చేయకపోవడంతో మున్సిపల్ శాఖ ప్రతి నెల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తున్నదని అధికారులు గుర్తించారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో అపార్ట్ మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో ఒక్కొక్కరు రెండు, మూడు నల్లా కనెక్షన్లు తీసుకుని డొమెస్టిక్ చార్జీలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఆన్ లైన్ చేయటం ద్వారా ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నామని అధికారులు అంటున్నారు.