100 మంది టెర్రరిస్టులు.. 3 పాక్​ ఎయిర్​ బేస్​లుమటాష్

100 మంది టెర్రరిస్టులు.. 3 పాక్​ ఎయిర్​ బేస్​లుమటాష్
  • మళ్లీ కాల్పులు జరిపితే అంతు చూస్తం
  • పాకిస్తాన్​కు త్రివిధ దళాల అధికారుల వార్నింగ్
  • కవ్విస్తే.. కరాచీ పోర్ట్​పై దాడికి అన్నీ సిద్ధం చేశాం
  • జనావాసాలపై మేం దాడులు చేయలేదు
  • ఆధారాలతో వీడియోలు రిలీజ్ చేస్తున్నాం
  • ఐదుగురు ఇండియన్ జవాన్లు అమరులయ్యారు
  • 35 నుంచి 40 మంది పాక్ రేంజర్లను మట్టుబెట్టినం
  • ‘ఆపరేషన్ సిందూర్’ బ్రీఫింగ్​లో వెల్లడి

న్యూఢిల్లీ: టెర్రరిజం అంతానికే ‘ఆపరేషన్‌‌ సిందూర్‌‌’ను ప్రారంభించామని భారత త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తామని పాకిస్తాన్​కు వార్నింగ్ ఇచ్చాయి. 3 పాకిస్తాన్ ఎయిర్ బేస్​లు, 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినట్లు ప్రకటించాయి. త్రివిధ దళాల డీజీఎంవో (డైరెక్టర్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ మిలటరీ ఆపరేషన్స్‌‌) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ‘ఆపరేషన్ సిందూర్’పై ఆదివారం మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చారు. ఎయిర్ మార్షల్ ఏకే భార్తీ, నేవీ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్​లతో కలిసి వివరాలు వెల్లడించారు. 

టెర్రరిస్ట్ క్యాంపులే లక్ష్యంగా తాము దాడులు చేశామన్నారు. ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్లను ముందే గుర్తించినట్లు వివరించారు. జనావాసాలపై తాము దాడి చేయలేదన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ మాత్రం ఆలయాలు, స్కూళ్లను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. 7 నుంచి 10వ తేదీ మధ్య పాకిస్తాన్​కు చెందిన 35 నుంచి 40 మంది ఆర్మీ రేంజర్లను మట్టుబెట్టామని తెలిపారు. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారన్నారు. వీరి త్యాగం వృథా కానివ్వమని తెలిపారు.

మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నయ్

ఆపరేషన్‌‌ సిందూర్ టైమ్​లో తమ ఫోకస్ అంతా లక్ష్యాలను ఛేదించడంపైనే ఉంటుందని త్రివిధ దళాల అధికారులు పేర్కొన్నారు. ‘‘మురిడ్కేలోని టెర్రర్​ క్యాంప్​ను ముందుగా ధ్వంసం చేశాం. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి టెర్రరిస్టులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు. 9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేసి.. 100 మంది టెర్రరిస్టులను ముట్టుబెట్టాం. ఉగ్రవాద శిబిరాలపై దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తున్నాం. మా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. నివాస స్థలాలు, ప్రార్థనా మందిరాలపై దాడి చేయలేదు’’ అని డీజీఎంవో తెలిపారు. లాహోర్‌‌లో ఎయిర్‌‌ డిఫెన్స్‌‌ సిస్టంను ధ్వంసం చేశామని వివరించారు.

దాడులు తిప్పికొట్టేందుకు నేవీ రెడీ

ఆపరేషన్‌‌ సిందూర్‌‌’లో భాగంగా నేవీ సిద్ధంగా ఉందని డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు. ‘‘పహల్గాం దాడి తర్వాత వెంటనే అప్రమత్తం అయ్యాం. బలగాలతో పాటు సబ్‌‌ మెరైన్లను అరేబియా సముద్రంలో మోహరించాం. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే కరాచీ పోర్టుపై కూడా దాడి చేస్తాం. కాల్పుల విరమణకు అంగీకరించి సంయమనం పాటిస్తే బాగుంటది. లేకపోతే మేము ఏం చేస్తామో పాకిస్తాన్​కు బాగా తెలుసు’’అని డీజీఎంవో తెలిపారు.

మన పైలట్లందరూ సేఫ్​

ఆర్మీ లక్ష్యం ప్రాణనష్టం కలిగించడం కాదని డీజీఎంవో తెలిపారు. ఒకవేళ అదే జరిగితే బాడీ బ్యాగులు కౌంట్ చేయడం తమ పని కాదని స్పష్టం చేశారు. తమ పని కేవలం లక్ష్యాన్ని ఛేదించడమే అని చెప్పారు. ‘‘పాకిస్తాన్ ఎయిర్​బేస్​లు, కమాండ్ సెంటర్లు, మిలటరీ ఇన్​ఫ్రా స్ట్రక్చర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేశాం. పాకిస్తాన్​కు చెందిన కొన్ని అత్యాధునిక విమానాలను కూల్చేశాం. ఇండియా యుద్ధ విమానాలను పాకిస్తాన్ నిర్బంధించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇండియన్ పైలట్లందరూ సేఫ్​గా తిరిగి వచ్చారు’’అని డీజీఎంవో తెలిపారు.

ప్రాధేయపడితేనే ఒప్పుకున్నం

8–9వ తేదీ రాత్రి లాహోర్‌‌ నుంచి డ్రోన్లు, యూఏవీలతో పాకిస్తాన్.. ఇండియన్ ఎయిర్‌‌ బేస్‌‌లు, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌‌ చేసిందని డీజీఎంవో తెలిపారు. డ్రోన్లు ఇండియన్ ఏయిర్​స్పేస్​లోకి వచ్చాయని, అన్నింటినీ కూల్చేశామని వివరించారు. ‘‘శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు పాకిస్తాన్ డీజీఎంవో మాకు ఫోన్‌‌ చేశారు. కాల్పుల విరమణకు అంగీకరించాలని ప్రాధేయపడ్డాడు.

దీంతో మేము అంగీకరించాం. కాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ కాల్పులకు దిగింది. ఫైరింగ్ జరిపినందుకు పాకిస్తాన్​కు వార్నింగ్‌‌ మెసేజ్‌‌ పంపించినం. ఒకవేళ ఆదివారం రాత్రి కాల్పులు జరిపితే మీ (పాకిస్తాన్) అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చినం’’ అని డీజీఎంవో తెలిపారు.