ఆందోళనలకు ఆంధ్రా సర్కార్​ అనుమతి నిరాకరణ

ఆందోళనలకు ఆంధ్రా సర్కార్​  అనుమతి నిరాకరణ

భద్రాచలం, వెలుగు: ఆంధ్రప్రదేశ్​లో విలీనం చేసిన పిచ్చుకులపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం పంచాయతీలను తెలంగాణకు ఇవ్వాలనే డిమాండ్​తో ప్రతిపక్షాలు ధర్నా చేశాయి. ఆదివారం రెండు రాష్ట్రాల బార్డర్​లోని రాజుపేట వద్ద ఈ ధర్నా చేపట్టాయి. ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, రావులపల్లి రాంప్రసాద్​, సీపీఎం లీడర్లు మచ్చా వెంకటేశ్వర్లు, బాలనర్సారెడ్డి, స్వామి, బీజేపీ నుంచి కుంజా ధర్మారావు, రామ్మోహన్​రావు, నాగబాబు, నక్కా వెంకన్న, భూక్యా బాల్య, బుడగం శ్రీనివాసరావు, బోగాల శ్రీనివాసరెడ్డి, చల్లగుల్ల నాగేశ్వరరావు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.

ఏపీలోని 5 పంచాయతీల్లోనే ఆందోళన చేపట్టాలని భావించినా, ఆ గ్రామాల్లో భారీగా బలగాలను మోహరించిన ఆంధ్రా సర్కార్​ ఆందోళనలకు అనుమతి నిరాకరించింది. దీంతో బార్డర్​కు దగ్గర ఉన్న భద్రాచలం టౌన్​లోని రాజుపేట వద్ద చర్ల–భద్రాచలం రోడ్డుపై ధర్నా చేశారు. ఈ ఐదు పంచాయతీలు ఏపీలో ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి ఉపయోగం లేదని, దక్షిణ అయోధ్యను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని పొదెం వీరయ్య, కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ గ్రామాలను ఏపీలో కలపడం వల్ల భద్రాచలం ముంపునకు గురవుతోందని, అందువల్ల ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్​ చేశారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఐదు గ్రామాలను తెలంగాణకు అప్పగించాలని ఎనిమిదేండ్లుగా ఆందోళన చేస్తున్నామని, ఇప్పుడు కొత్తగా నిరసన చేపట్టినట్టుగా కామెంట్లు చేయడం సరికాదని పేర్కొన్నారు.