మెదక్, వెలుగు: అవయవదానంపై జీవన్‌దాన్, లయన్స్ క్లబ్, రెడ్‌క్రాస్ సొసైటీ వంటి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రచారం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో, తీవ్ర అనారోగ్య సమస్యలతో కొందరు బ్రెయిన్ డెడ్ అయి జీవచ్ఛవాళ్ల మారుతుండగా వారి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖాన్ని దిగమింగుకొని అవయవదానానికి ముందుకు వస్తున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వారి కిడ్నీలు, గుండె, లివర్, లంగ్స్, కళ్లు, ఆయా అవయవాలు పూర్తిగా పాడైన వారికి అమర్చేందుకు అవకాశం ఉంది.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖలోని జీవన్ దాన్ విభాగం అవయవదానంపై అవగాహన కల్పించి బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను సేకరించి అవసరమైన వారికి అమర్చేందుకు కృషి చేస్తోంది. పలువురు చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసేందుకు ముందుకు వస్తుండగా, మరికొందరు మరణానంతరం అవయవదానం చేసేందుకు అంగీకరిస్తూ జీవన్ దాన్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు.
నలుగురి ప్రాణాలు నిలిపారు
నిజాంపేటకు చెందిన బైండ్ల బాలమల్లు (57) ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ మెన్ గా పనిచేసేవాడు. 2023లో రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో విధులు నిర్వర్తిస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వారం రోజుల తర్వాత డాక్టర్లు బాలమల్లు బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. అతని ఆర్గాన్స్ ఇతరులకు అమర్చడానికి పనికొస్తాయని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు అతడి అవయవ దానానికి అంగీకరించారు. ఈ మేరకు డాక్టర్లు అతని ఆర్గాన్స్ ను మరో నలుగురికి అమర్చారు.
ఏడుగురికి అవయవదానం
పాపన్నపేట మండలం మల్లంపేటకు చెందిన శ్రీనివాస్ చారి 2022 జూన్ లో తీవ్ర అనారోగ్యానికి గురికాగా అతని బ్రెయిన్ డెడ్ అయింది. డాక్టర్ల సూచన మేరకు అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. జీవన్‌దాన్ ట్రస్ట్ సహకారంతో శ్రీనివాస్ చారి అవయవాలు సేకరించి ఆయా అవయవాలు అవసరమైన ఏడుగురు వ్యక్తులకు వాటిని అమర్చారు. మానవత్వంతో అవయవదానానికి ముందుకు వచ్చిన శ్రీనివాస్ చారి భార్య లావణ్య , కొడుకు అభిషేక్ ను జీవన్‌దాన్ బాధ్యులు సన్మానించి అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందజేశారు.
ముందుకు వచ్చిన తల్లిదండ్రులు
మెదక్ పట్టణానికి చెందిన రాయకంటి మోక్షిత్ (16) హైదరాబాద్‌లో ఇంటర్చదువుతుండగా 2022లో అకస్మాత్తుగా క్లాస్ రూమ్‌లోనే అనారోగ్యానికి గురై కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు యశోదా హాస్పిటల్లో చేర్పించినా నయం కాకపోగా బ్రెయిన్ డెడ్ అయింది. అతడు బతకడని తెలిసి డాక్టర్ల సూచన మేరకు మోక్షిత్అవయవాలు దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. జీవన్ దాన్ సహకారంతో అతని అవయవాలు నలుగురికి అమర్చారు.
గ్రీన్ చానెల్ ద్వారా..
అల్లాదుర్గం మండల పరిధిలోని చేవెళ్ల గ్రామానికి చెందిన మధునురోళ్ల శ్రీకాంత్ (32) ఈనెల 5న బైక్ మీద హైదరాబాద్ వెళ్తుండగా సంగారెడ్డి శివారులో మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. తొమ్మిది రోజుల పాటు మృత్యుతో పోరాడిన శ్రీకాంత్ కు మంగళవారం బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. జీవన్‌దాన్ బాధ్యుల సూచన మేరకు శ్రీకాంత్ అవయవాలను దానం చేసేందుకు భార్య సారిక, తల్లిదండ్రులు నాగమణి, శివరాజ్ అంగీకరించారు. ఈ మేరకు శ్రీకాంత్ గుండెను గ్రీన్‌చానెల్ ద్వారా తీసుకెళ్లి నిమ్స్ హాస్పిటల్లో కార్డియక్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి అమర్చారు. అలాగే లివర్, లంగ్స్, రెండు కిడ్నీలు సేకరించి వాటిని నలుగురికి అమర్చారు.
యువకుడి కుటుంబం ఆదర్శం
నిజాంపేట మండల పరిధిలోని కె .వెంకటాపూర్ గ్రామానికి చెందిన గైసింగారం రాకేశ్ (19 ) కామారెడ్డి నుంచి స్వగ్రామానికి వచ్చే క్రమంలో యాక్సిడెంట్ జరిగింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. రాకేశ్ చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబ సభ్యులు అతడి అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు.
