ఉస్మాన్సాగర్ కు వరద ఉధృతి

ఉస్మాన్సాగర్ కు వరద ఉధృతి
  • 8 గేట్లు ఎత్తిన అధికారులు
  • మంచిరేవులకు రాకపోకలు బంద్​

హైదరాబాద్​సిటీ/ గండిపేట, వెలుగు: గ్రేటర్​నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలైన ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​కు  భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం ఉస్మాన్​సాగర్​కు వరద తాకిడి పెరగడంతో మెట్రోవాటర్​బోర్డు అధికారులు 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువకు వదిలారు. వరద ఉధృతి పెరగడంతో నార్సింగి నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పై నుంచి, మంచిరేవుల బ్రిడ్జి పైనుంచి వరద వెళ్తోంది. దీంతో రాకపోకలు స్తంభించి పోయాయి. దీంతో అధికారులు నార్సింగి వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్​రూట్​మూసివేశారు. 

భారీ వరద కారణంగా మంచి రేవుల గ్రామానికి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. మంచి రేవులకు వెళ్లే వారు దాదాపు 10 కి.మీ. తిరిగి పోలీస్​అకాడమీ వైపు నుంచి వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉస్మాన్​సాగర్​లోకి ఇన్​ఫ్లో 800 క్యూసెక్కులు కాగా, ఔట్​ ఫ్లో 2704 క్యూసెక్కులు ఉంది. అలాగే హిమాయత్​సాగర్​ కూడా ఫుల్​ ట్యాంక్​ చేరుకుంది. ఈ జలాశయం ఇన్​ఫ్లో 500 క్యసెక్కులు కాగా, ఔట్​ ఫ్లో 2300 క్యూసెక్కులగా ఉంది. ప్రస్తుతం హిమాయత్​ సాగర్​2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువ మూసీలోకి నీటిని వదులుతున్నారు.