గద్వాలను పాలమూరు పార్లమెంట్ పరిధిలోకి తెస్తా : ఎంపీ డీకే అరుణ

గద్వాలను పాలమూరు  పార్లమెంట్  పరిధిలోకి తెస్తా : ఎంపీ డీకే అరుణ
  • పాలమూరు ఎంపీ డీకే అరుణ

గద్వాల, వెలుగు: తన మీద కోపంతో ఓ నాయకుడు చేసిన తప్పిదాన్ని తాను సరి చేస్తానని, గద్వాల నియోజకవర్గాన్ని పాలమూరు పార్లమెంట్  పరిధిలో చేర్పిస్తానని ఎంపీ డీకే అరుణ తెలిపారు. గద్వాల నియోజకవర్గానికి పదిహేను రోజులకోసారి వస్తానని, ఆగిపోయిన అభివృద్ధిని పట్టాలెక్కిస్తానని చెప్పారు. ఆదివారం తపస్  ఆధ్వర్యంలో జరిగిన గురువందన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఏవీఎన్  రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీచర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్  పాలనలో గద్వాల నియోజకవర్గం అభివృద్ధికి దూరమైందన్నారు. 

గతంలో తాను ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. ఒకప్పుడు గద్వాల అభివృద్ధికి కేరాఫ్ గా ఉండేదని, ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో మహబూబ్ నగర్  పార్లమెంట్ లో గద్వాలను కలిపేందుకు కృషి చేస్తానన్నారు.

గురువులే మార్గనిర్దేశకులు..

సమాజంలో గురువులే మార్గనిర్దేశకులని ఎంపీ అన్నారు. టెక్నాలజీ వాడకం, అనర్థాలపై చిన్నప్పటి నుంచే పిల్లల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తపస్  పని తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. స్టేట్  ప్రెసిడెంట్  హనుమంతరావు, డీకే స్నిగ్దారెడ్డి, మనోహర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరేశ్, అయ్యన్న పాల్గొన్నారు.