ఏపీలో పోటెత్తిన పాపాగ్ని నది.. హైవేపై కుంగిన బ్రిడ్జి

ఏపీలో పోటెత్తిన పాపాగ్ని నది.. హైవేపై కుంగిన బ్రిడ్జి
  • కడప జిల్లా కమలాపురం-వల్లూరు హైవేపై కుంగిపోయిన బ్రిడ్జి
  • బ్రిడ్జి ఏ క్షణంలోనైనా వరద ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం
  • ఇటు మైదుకూరు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మీదుగా..
  • అటు పులివెందుల, ముద్దనూరు మీదుగా వాహనాల దారి మళ్లింపు

కడప: వారం రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాపాగ్ని నది  పోటెత్తుతోంది. వర్షాకాలాన్ని మరిపించే రీతిలో పాపాగ్ని నది వరద నీటితో నది ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కమలాపురం-వల్లూరు మార్గంలో జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయింది. ఏ క్షణంలోనైనా కూలి వరదలో కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కుంగిన బ్రిడ్జిమీదుగా వాహనాలు లేదా.. పాదచారులు ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
కమలాపురం మీదుగా కడపకు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇటు మైదుకూరు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల.. అటు పులివెందుల, ముద్దనూరు మీదుగా వాహనాలు దారి మళ్లిస్తున్నారు. బ్రిడ్జి ఏ క్షణంలో నైనా కుప్పకూలే ప్రమాదం ఉండడంతో కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ బి.వెంకటశివారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవసరమైన అత్యవసర మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కోరారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వాహనదారులను అప్రమత్తం చేస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పాపాగ్ని నది పై ఉన్న బ్రిడ్జి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మరమ్మతులు పూర్తయ్యే వరకు వాహనాలను దారి మళ్లించినట్లు కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి తెలిపారు. కడప నుండి  కమలాపురం వైపు వెళ్లాల్సిన వాహనాల ను ఇర్కాన్ సర్కిల్ వద్ద దారిమళ్లించడం జరుగుతోందన్నారు. ఆర్టీసీ ఇతర దూర ప్రాంతాల ప్రయాణికులు  ప్రత్యామ్నాయ రహదారుల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని డీఎస్పీ వెంకట శివారెడ్డి సూచించారు. అనంతపురం, తాడిపత్రి వెళ్లాల్సిన వారు మైదుకూరు, ప్రొద్దుటూరు లేదా పులివెందుల మీదుగా వెళ్లేలా చేస్తున్నామని తెలిపారు. కమలాపురం, ఎర్రగుంట్ల నుండి కడప వైపు వెళ్లే వాహనాలు ప్రొద్దుటూరు లేదా పులివెందుల మీదుగా కడప కు చేరుకోవాలని సూచించారు. కడప నుండి ఎర్రగుంట్ల వెళ్లాల్సిన వారు మైదుకూరు మీదుగా వెళ్లాలని, వాహనదారులు, ఇతర ప్రజలు కూడా ప్రమాదాలు జరగకుండా పోలీసు శాఖకు సహకరించాలని కడప పోలీసులు కోరారు.