8 మంది డెడ్బాడీలు దొరకట్లే .. సిగాచి మృతుల కోసం 7వ రోజు కొనసాగిన సహాయక చర్యలు

8 మంది డెడ్బాడీలు దొరకట్లే .. సిగాచి మృతుల కోసం 7వ రోజు కొనసాగిన సహాయక చర్యలు

సంగారెడ్డి, పటాన్​చెరు, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 8 మంది మృతుల ఆనవాళ్లు దొరకకపోవడంతో వారి డెడ్ బాడీల గురించి ఏడో రోజు ఆదివారం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. శిథిలాలను రెస్క్యూ టీం మరింత నిశితంగా పరిశీలిస్తోంది. పేలుడు ధాటికి ఎముకలు సైతం లభించే పరిస్థితి లేకపోవడంతో అణువణువు గాలిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ 8 మంది కార్మికుల కోసం వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉండగా  అధికారులు ఐలా భవన్ లో వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి భోజనం ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. డెడ్ బాడీలను త్వరితగతన గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. 

అనంతరం పటాన్ చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీని సందర్శించి అక్కడున్న డెడ్ బాడీ లను డీఎన్ఏ ద్వారా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ఘటనా స్థలంలో శిథిలాలను తొలగించి మరోచోట డంప్ చేసి అక్కడ డెడ్ బాడీల కోసం రెస్క్యూ టీం వెతుకుతుండగా  అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆచూకీ లభించని ఎనిమిది మంది డెడ్ బాడీలు పూర్తిగా కాలి బూడిదయినట్టు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జీఆర్ఎఫ్, డీడీఆర్ ఎస్, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. 

ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయిన 42 మంది డెడ్ బాడీలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు ప్రకటించారు. 23 మంది క్షతగాత్రులు వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పూర్తిస్థాయిలో కార్మికుల డెడ్ బాడీలను గుర్తించి సహాయక చర్యలు నిలిపి వేస్తామని జిల్లా యంత్రాంగం పేర్కొన్నప్పటికీ రాత్రి వరకు ఆ 8 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం కూడా యధావిధిగా అధికారుల సహాయక చర్యలు కొనసాగనున్నాయి.