థియేట‌ర్లో పవన్ ఫ్యాన్స్ రచ్చ ..పవర్ స్టార్ అభిమానులపై కేసు

థియేట‌ర్లో పవన్  ఫ్యాన్స్ రచ్చ ..పవర్ స్టార్ అభిమానులపై కేసు

భీమవరంలో జరిగిన జనసేన బహిరంగ సభలో మైకందుకున్న పవన్…ఇతర స్టార్ హీరోల అభిమానులతో గొడవలు పెట్టుకోవద్దని వేడుకున్నారు. మన సినిమా పోస్టర్స్ ఎవరైనా చించినా క్షమించేయమని కోరారు. పరోక్షంగా మీరు కూడా ఇతర హీరోల పోస్టర్లూ చింపే చిల్లర పనులకు తెగబడొద్దని సూచించారు. అయితే పవన్… పోస్టర్స్ చించొద్దని చెప్పాడే కానీ సినిమా తెర చింపొద్దని చెప్పలేదుగా అనుకున్నారో ఏమో కానీ థియేటర్ లో తెర చించి రచ్చ రచ్చ చేశారు పవన్ ఫ్యాన్స్. 

విజయవాడలోని ఒక థియేటర్ లో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు. థియేటర్ ను పూర్తిగా ధ్వంసం చేశారు..తెరని చించేశారు.. థియేటర్ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “తొలిప్రేమ” సినిమా ప్రదర్శిస్తున్న విజయవాడ  కపర్థి థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ నాగా బీభత్సం చేశారు. తెరచింపేశారు.  దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్  న‌టించిన ఎవ‌ర్ గ్రీన్ క్లాసిక్ మూవీ `తొలిప్రేమ‌` ఏ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శక‌త్వంలో జీవీజీ రాజు నిర్మించిన ఈ మూవీని దాదాపు 25 ఏళ్ల రీ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. రీమాస్టర్ చేసి శుక్రవారం (జూన్ 30)  భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్ల వ‌ద్ద శుక్రవారం (జూన్ 30)ఉద‌యం నుంచే ఫ్యాన్స్ హంగామా మొద‌లైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తొలిప్రేమ సినిమాను గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్‌లో శుక్రవారం (జూన్ 30)  ప్రదర్శించారు.సెకండ్‌ షో రాత్రి 10.30 గంటలకు స్టార్ట్ కాగా..10.45కి కొంతమంది అభిమానులు రెచ్చిపోయి సినిమా స్క్రీన్ చించేసి, సీట్లు ధ్వంసం చేశారు. థియేట‌ర్ ను విధ్వంసం చేయాల‌నే కుట్రలో భాగంగానే థియేట‌ర్‌కు కొంత మంది యువ‌కులు వ‌చ్చార‌ని  థియేట‌ర్ సిబ్బంది ఆరోపించారు. సినిమా ప్రదర్శన మ‌ధ్యలో ప‌ది మంది అక‌స్మాత్తుగా లేచి గొడ‌వ చేశారు. స్క్రీన్‌పైకి ఎక్కి తెర‌ను కోసేశారు. సీట్లపైకి ఎక్కి పీకేశారు. అడ్డు వ‌చ్చిన వారిని కొట్టారు.  థియేట‌ర్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. బ‌య‌ట అద్దాలు కూడా ప‌గుల గొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్‌లో విధ్వంసం సృష్టించి మొత్తం రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారని థియేటర్‌ మేనేజర్‌ బి.మోహనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు  కేసు నమోదు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు

ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల పేరుతో ఇదంతా కావాల‌నే చేశారా.. ఇది బ‌య‌టి వాళ్లు చేశారా? అభిమానులు చేశారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ సంఘ‌ట‌న చూస్తే విధ్వంసం వెన‌క కుట్ర ఉంద‌నే అనుమానం కలుగుతోందన్నారు పోలీసులు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌మ అభిమానుల‌ను కంట్రోల్ చేయాలని ఇతర ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం  దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.